ఆ విషయంలో మైనింగ్ పాత్ర కీలకం.. జాతీయ సదస్సులో శైలేంద్ర కుమార్

by Sridhar Babu |

<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: దేశాన్ని ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డం, సుస్థిర‌మైన అభివృద్ధి సాధించ‌డంలో మైనింగ్ రంగానికి కీల‌క పాత్ర అని, ముఖ్యంగా త‌యారీ రంగానికి అవ‌స‌రమైన 12 అతి కీల‌క‌మైన ఖ‌నిజాల‌తో ప్రపంచంలో భార‌త్‌ను అగ్రస్థానంలో నిల‌ప‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ రీజిన‌ల్ కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ శైలేంద్ర కుమార్ అన్నారు. అధునాత‌న సాంకేతిక‌త‌ల‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు, ఫ్లాట్ స్క్రీన్స్‌, డిఫెన్స్‌, ఆటోమొబైల్స్‌, మెడిక‌ల్ ఇమేజింగ్‌, టెలివిజ‌న్స్ లాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్లో [&hellip;]</p>

Shailendra Kumar
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: దేశాన్ని ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డం, సుస్థిర‌మైన అభివృద్ధి సాధించ‌డంలో మైనింగ్ రంగానికి కీల‌క పాత్ర అని, ముఖ్యంగా త‌యారీ రంగానికి అవ‌స‌రమైన 12 అతి కీల‌క‌మైన ఖ‌నిజాల‌తో ప్రపంచంలో భార‌త్‌ను అగ్రస్థానంలో నిల‌ప‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ రీజిన‌ల్ కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ శైలేంద్ర కుమార్ అన్నారు. అధునాత‌న సాంకేతిక‌త‌ల‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు, ఫ్లాట్ స్క్రీన్స్‌, డిఫెన్స్‌, ఆటోమొబైల్స్‌, మెడిక‌ల్ ఇమేజింగ్‌, టెలివిజ‌న్స్ లాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్లో ఈ క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని, ఈ ఖ‌నిజాల అన్వేష‌ణ‌, ఉత్పత్తి, ఎగుమ‌తుల్లో చైనా అగ్రస్థానంలో నిల‌వ‌డం వ‌ల్లే అక్కడ త‌యారీ రంగంలో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధ్యమ‌వుతోంద‌ని తెలిపారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా హైద‌రాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైద‌రాబాద్‌లోని రాయ‌ల్‌ట‌న్ హోట‌ల్‌లో ‘రోల్ ఆఫ్ క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ ఇన్ నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స‌ద‌స్సులో ఆయ‌న ముఖ్య అతిథిగా మాట్లాడారు.

బెరీలియ‌మ్‌, జ‌ర్మేనియ‌మ్‌, రీనియ‌మ్‌, టంటాల‌మ్‌, అరుదైన భూ ఖ‌నిజ‌వ‌న‌రులు(రేర్ ఎర్త్ మిన‌ర‌ల్స్‌) లాంటి వాటిని ప్రస్తుతం ప్రపంచ త‌యారీ రంగానికి కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయని, వీటిని మ‌న దేశంలోనూ గుర్తించి ఉత్పత్తి చేయ‌గ‌లిగితే రానున్న ద‌శాబ్ద కాలంలో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధించ‌గ‌లుగుతామ‌న్నారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ద్వారా థ‌ర్మల్ విద్యుత్ త‌యారీ జ‌రుగుతోంద‌ని, అయితే బొగ్గు వ్యర్థాలైన ఫ్లైయాష్ త‌దిత‌రాల్లోనూ ఉన్న క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌ను వెలికితీసి ఉప‌యోగించే ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంత‌మయ్యాయ‌ని, మ‌న దేశంలోనూ బొగ్గు వ్యర్థాల‌ను స‌ద్వినియోగం చేసుకునే సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.మ‌ధుసూద‌న మాట్లాడుతూ.. దేశ ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చడానికి ప్రస్తుతం బొగ్గు రంగంలో చాలా వ‌ర‌కు స్వయం స‌మృద్ధి సాధించామ‌ని, ఇత‌ర దేశీయ అవ‌స‌రాల‌ను తీర్చడంలోనూ మైనింగ్ ముఖ్య పాత్ర పోషించాల‌న్నారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేష‌న్ గ‌త ఆరు ద‌శాబ్దాలుగా విద్యార్థులు, వృత్తి నిపుణులు, ఇంజినీర్లకు మైనింగ్లో వస్తున్న మార్పుల‌పై ఎప్పటిక‌ప్పుడు సెమినార్లు, వెబినార్లు నిర్వహిస్తూ అవ‌గాహ‌న క‌ల్పిస్తోంద‌ని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేష‌న్‌, ఉస్మానియా, కాక‌తీయ వ‌ర్సిటీల పూర్వ విద్యార్థుల చొర‌వ‌తో ప్రతిష్టాత్మక‌మైన ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలో ఈ ఏడాది నుంచి బీటెక్ మైనింగ్ కోర్సు అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా తెలంగాణలో ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చడంలో సింగ‌రేణి ముఖ్య భూమిక పోషిస్తోంద‌ని ఆ సంస్థ డైరెక్టర్(ఆప‌రేష‌న్స్‌) ఎస్‌.చంద్రశేఖ‌ర్ అన్నారు. జాతీయ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సంప్రదాయ ఇంధ‌న వ‌న‌రుల ద్వారా విద్యుత్ అవ‌స‌రాలు తీర్చడ‌మే కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ ముంద‌డుగు వేశామ‌న్నారు. ముగింపు స‌మావేశంలో ఎంఈఏఐ మాజీ అధ్యక్షుడు సంజయ్ ప‌ట్నాయ‌క్‌, ఏఎండీ మాజీ అధిప‌తి డాక్టర్ య‌మునా సింగ్‌, ఎంఈఏఐ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ఎం.న‌ర్సయ్య ప్రసంగించారు.

Next Story