అమిత్ షా నివాసానికి ‘షహీన్‌బాగ్’!

by  |
అమిత్ షా నివాసానికి ‘షహీన్‌బాగ్’!
X

రెండు నెలలుగా వందలాది మంది ఆడా మగ, చిన్నారులన్న తేడా లేకుండా పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్న షహీన్‌బాగ్.. ఆందోళనలకు కేంద్రస్థానంగా, ప్రతిరూపంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కీలకాంశంగా మారింది. ఈ ఆందోళనకారులు నేడు(ఆదివారం) మరో అడుగు ముందుకేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి మార్చ్ చేసి తమ డిమాండ్ల చిట్టాను అందించాలని భావిస్తున్నారు. కేవలం ప్రతినిధుల బృందం కాదు.. వారందరూ హోం మంత్రితో వివాదాస్పద సీఏఏపై మాట్లాడుతామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కావాలని నిర్ణయించారు.

సీఏఏఫై ఎటువంటి సందేహాలున్నా.. తాను చర్చించేందుకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఓ టీవీ షోలో పేర్కొన్న విషయం తెలిసిందే. తన కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ తీసుకుంటే.. చర్చించేందు మూడు రోజుల్లో అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. కాగా, నేడు షహీన్‌బాగ్ ఆందోళనకారులు అమిత్ షా తో ఈ వివాదాస్పద చట్టంపై చర్చించేందుకు బయల్దేరారు. అయితే, తాము హోం మంత్రి నుంచి అపాయింట్‌మెంట్ తీసుకోలేదని తెలిపారు. షహీన్‌బాగ్ నుంచే మార్చ్ మొదలుపెట్టేందుక ప్రయత్నిస్తామని, పోలీసులు అనుమతిస్తారో లేదో వారిపైనే ఆధారపడిందని చెప్పారు.

కాగా, అమిత్ షాను కలిసేందుకు ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసులు అనుమతినివ్వలేదు. కేంద్ర మంత్రిని ఎవరెవరు కలుస్తారో ఒక ప్రతినిధి బృందం వివరాలను అడగ్గా.. అందరం వెళతామని సమాధానమిచ్చినట్టు పోలీసులు తెలిపారు. అందుకు నిరాకరించినట్టు చెప్పారు. అయితే, ఎంతమందితో మాట్లాడుతారన్న విషయం కేంద్రమంత్రి స్పష్టతనివ్వాల్సి ఉంటుందని ఓ ఆందోళనకారుడు అభిప్రాయపడ్డాడు. మంత్రితో కలిశాక.. సీఏఏ-ఎన్ఆర్‌సీ-ఎన్‌పీఆర్లను ఉపసంహరించుకోవాలన్నది తమ ప్రధాన డిమాండ్‌గా ఉంటుందని మరో ఆందోళనకారిణి తెలిపారు.


Next Story

Most Viewed