- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు మద్యం తాగనిదే నిద్రరాదు.. నా భార్య ఓ కోటీశ్వరుడితో వెళ్లిపోయింది.. నాదే తప్పా?
మాది ప్రేమ వివాహం. మాకు ముగ్గురు పిల్లలు. నాకు మద్యం తాగనిదే నిద్రరాదు. ఓ రోజు నేను బాగా తాగి, అపస్మారక స్థితిలోకి వెళ్లితే తాను దగ్గరుండి బతికించింది.

మాది ప్రేమ వివాహం. మాకు ముగ్గురు పిల్లలు. నాకు మద్యం తాగనిదే నిద్రరాదు. ఓ రోజు నేను బాగా తాగి, అపస్మారక స్థితిలోకి వెళ్లితే తాను దగ్గరుండి బతికించింది. అయినా నేను మందు మానలేదు. తాను ఆత్మహత్యా యత్నమూ చేసింది. నేను పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఓ రోజు కోటీశ్వరుడైన తన చిన్ననాటి స్నేహితునితో నా పిల్లలను తీసుకుని లేచిపోయింది. నన్ను మార్చుకోకుండా ఇంకొకరితో ఇలా లేచిపోవడం మంచిదేనా? ఆమెది సమాజంలో ఉన్నత కులం. రోజూ పూజలు చేస్తుంది. ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. కొన్నాళ్ళకు నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు. నా భార్యకు తన స్నేహితుడితోనూ అభిప్రాయభేదాలు వచ్చి విడిపోయారు. ‘నేను మద్యం మానేశానని, మంచిగా ఉంటున్నానని’ తెలిసి నా భార్య ఇంటికి వచ్చినప్పుడు నేను అందరి ముందు చెప్పు చూపించి, గెంటేశాను. ఇప్పుడు నేను నా మేన మరదలని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. తను నాపై కోర్టులో కేసు వేసింది. అలాంటి భార్యను తెచ్చుకుంటే సమాజంలో నా విలువ ఏం కావాలి? మీ సలహా? -ఆర్ఆర్ఎస్, వరంగల్
భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా ఎంత హింసిస్తున్నా, అవమానిస్తున్నా జీవితాన్ని ధ్వంసం చేస్తున్నా సహనంతో ఉంటూ, అదీ అతని డిమాండ్ ప్రకారం జీవితకాలమంతా భర్తను మార్చుకునే ప్రయత్నాలు చేసుకుంటూ, చచ్చేముందు ‘గొప్ప పతివ్రత’ అన్న శుభం కార్డుతో మరీ చావాలి. ఇదీ ఈ పురుషాధిక్య సమాజం డిమాండ్. మీరు తాగి తందనాలాడి దారితప్పి ప్రాణాలమీదకు తెచ్చుకున్నప్పుడల్లా ముగ్గురు పిల్లల తల్లిగా మీ భార్య తన సర్వశక్తులూ ధారపోసి కాపాడుకుందని మీరే ఒప్పుకున్నారు. అయినా, ఆమె ఎందుకు మీ స్నేహితుడితో వెళ్లిపోయింది మరి? ఆమె మీతో విసిగి వేసారిపోయి మిగిలిన కొద్ది విశ్రాంత జీవితాన్నో, ప్రశాంతతనో కోరుకొనుంటుంది. ఆమెకా హక్కుంది. తనకు తోచిన పరిష్కారం వెతుక్కుంది. మీతో ప్రేమబంధంలో ఉన్న మీ భార్య అలా చేయచ్చా అంటే మీ మీద ఆమె ప్రేమని మీరేనాడు నిలుపుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ప్రతిఫలంగా ఆమెకు మీరు ఏమిచ్చారు? సరే, విసిగి వెళ్ళిపోయినా ఆమె మళ్ళీ మీ వద్దకు వస్తే చెప్పుచూపించి అవమానించారు. అసలా అర్హత మీకు వుందా?
సుదీర్ఘమైన మీ దాంపత్య జీవితంలో మీరు అవమానించినపుడల్లా తాను కూడా ఈ పని చేసి వుండొచ్చు కదా? చేయకపోవడం ఆమె సంస్కారం. ఆమె వెళ్ళిపోయినప్పుడైనా మీ తాగుడు మాని ఆమె దగ్గరకి వెళ్లి తిరిగి మీ జీవితంలోకి తెచ్చుకోవలసింది. ఇప్పుడు సలహా అడిగారు. కాబట్టి నేను చెప్పినట్టైనా చేస్తారా? మీ మరదలితో మరో పెళ్ళి వద్దు. 20, 18, 16 సంవత్సరాల వయస్సున్న మీ పిల్లలు తల్లిని, మీరవమానిస్తే, బాధస్తే ఓర్వలేక వెళ్ళిపోయిన మీ ఇల్లాలిని తిరిగి తెచ్చుకోండి. ఆమెకా గౌరవాన్ని ఇవ్వండి. ఆమె దానికి అర్హురాలే! ఆమె మీపై వేసిన కంజుగల్ రైట్స్ కేసు విరమించుకోవడం ఆమె ఇష్టం. ప్రేమించిన వారిపై ఇలా చేయచ్చా? అని అడిగారు. మీతో జీవితంలో విసిగిపోయిన మనషిని ఈ హక్కునన్నా పొందనివ్వండి.
ఆమెను తిరిగి మీ వద్దకు తెచ్చుకోవడం వల్ల తాగి మత్తులో ధ్వంసం చేస్తున్న మీ విలువ పెరుగుతుందే కానీ తరగదు. మీ పిల్లలకు తల్లి దక్కుతుంది. మిమ్మల్ని ప్రేమతో చూసుకునే సమాజం దొరుకుతుంది. మీ భార్య మీ స్నేహితుడిపై మోహంతో వెళ్ళలేదు. మీతో, మీ తాగుడితో, మీ బాధ్యతా రాహిత్య ప్రవర్తనతో విసిగి వెళ్ళిపోయింది. వాస్తవికతతో, మానవత్వంతో ఆలోచించండి. మీ భార్యను మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీతో మీ పిల్లలు కూడా అన్యాయానికి లోనయ్యారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళతో బాధ్యతతో వ్యవహరించి మంచి జీవితం ఇవ్వండి. అది మీరు వాళ్ళకు, వాళ్ళ కన్నతల్లిని ఇవ్వడంలో మాత్రమే దొరుకుతుంది.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్






