పెళ్లైన 2 నెలలకే ప్రెగ్నెన్సీ, ఆపై HIV.. నీ చావు నువ్వు చావని వదిలేసిన తల్లిదండ్రులు

by Bhoopathi Nagaiah |

పెళ్లికి ముందు వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం ఓ యువతి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లైన రెండు నెలలకే గర్భందాల్చడంతోపాటు HIV బారిన పడింది.

పెళ్లైన 2 నెలలకే ప్రెగ్నెన్సీ, ఆపై HIV.. నీ చావు నువ్వు చావని వదిలేసిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: యువత సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎంత అవగాహన పెంచుకున్నా పెళ్లీలపై మాత్రం ఏమాత్రం నాలెడ్జ్ సంపాదించలేకపోతున్నారు. వివాహం అనగానే భారీ మండపాలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, విలాసవంతమైన ఫంక్షన్ హాళ్లు, నూటొక్క తీరు వంటకాల గురించే ఆలోచిస్తున్నారు. కానీ, పెళ్లికి ముందు వధువరులకు వైద్య పరీక్షల గురించి ఏ ఒక్క యువ జంట ఆలోచించడం లేదు. ఇరువైపుల ఉన్న తల్లిదండ్రులు, బంధువులు సైతం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. అదే యువ జంటల పాలిట నరకకూపంగా మారుతుంది. తాజాగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన యువతికి గర్భంతోపాటు హెచ్ఐవీని గిఫ్ట్‌గా ఇచ్చాడో భర్త. ఇందుకు సంబంధించిన వివరాలను పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ వైద్యురాలు వెల్లడించింది.

హైదరాబాద్‌కు చెందిన యువతికి ఇటీవల పెద్దలు వివాహాన్ని కుదిర్చారు. అబ్బాయి మంచోడు, ఉద్యోగం ఉంది, ఆర్థికంగా స్థిరపడిన ఫ్యామిలీ అంటూ భారీగా కట్నకానులు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఎన్నో కలలతో ఆ యువతి అత్తారింట్లో అడుగు పెట్టింది. పెళ్లి మురిపెం నుంచి నూతన దంపతులు బయటపడక ముందే రెండే నెలలోనే యువతి గర్భం దాల్చింది. ఈ శుభవార్తతో రెండు కుటుంబాలు సంబురాలు చేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. ప్రెగ్నెన్సీ టెస్టులకు హాస్పిటల్‌కు వెళ్లిన యువతికి HIV పాజిటివ్ అని వైద్యులు డిక్లేర్ చేశారు. ఆ షాకింగ్ రిపోర్ట్‌తో యువతి స్పృహతప్పి పడిపోయింది. బిడ్డ పుడుతుందన్న సంతోషం ఒక్కసారిగా ఆవిరై పోయింది. అసలు ఇదేలా సాధ్యం అంటూ భర్తను నిలదీసింది.

అయితే, కుటుంబ సభ్యులు యువతినే తప్పు బట్టారు. పెళ్లైన రెండు నెలలకే గర్భం ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించారు. HIV కూడా పెళ్లికి ముందే సోకిందని తిట్టిపోశారు. యువతి తల్లిదండ్రులు సైతం అత్తింటి వారికే వంతపాడారు. ‘నీకో చెల్లి ఉంది.. ఆమె పెళ్లి కావాలంటే నువ్వు మళ్లీ మా గడపలో అడుగు పెట్టవద్దు’ అంటూ కూతురుకు ఖరాఖండిగా చెప్పేశారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి తాజాగా ఓ డాక్టర్‌ను సంప్రదించింది. తనకు పెళ్లికి ముందు ఏ ఒక్కరితోనూ సంబంధం లేదని, శృంగారం ఎలా చేసుకుంటారో కూడా నాకు తెలియదని వాపోయింది. అయినా నాకు HIV సోకిందని కన్నీరు పెట్టుకుంది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన వైద్యురాలు.. భర్తకు రక్త పరీక్షలు చేసి అతడి ద్వారానే HIV సంక్రమించిందని తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా సదరు వైద్యురాలు యువతకు పలు సూచనలు చేసింది. పెళ్లికి ముందు సెక్స్‌పై అవగాహన పెంచుకోవాలి కానీ సెక్స్ చేయకూడదని హెచ్చరించింది. టెక్నాలజీపై ఎంతో అవగాహన పెంచుకుంటున్న యువత పెళ్లికి ముందు ఎందుకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లేదని నిలదీసింది. సోషల్ మీడియా, బూతు సైట్లకు అలవాటు పడి 15 ఏళ్లు నిండక ముందే శృంగారంలో పాల్గొంటున్నారు కానీ, కాబోయే భాగస్వామికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఎందుకు తెలుసుకోవడం లేదని ప్రశ్నించింది. అపరిచితులతో సెక్స్ సురక్షితం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో శృంగారంలో పాల్గొంటే ఖచ్చితంగా కండోమ్ ధరించాలని సూచించింది. ఆరోగ్యకరమైన సంసారం కావాలంటే పెళ్లికి ముందే తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని, లేదంటే ఈ యువతికి జరిగిన అన్యాయమే మీ కుటుంబంలోనూ జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా ఆ యువతి HIV భారిన పడి తీవ్ర డిఫ్రెషన్‌లోకి వెళ్లిందని, భర్త అజాగ్రత్త వల్ల ఆమె జీవితం ప్రమాదంలో పడిందని ఆ వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story