స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్!

by  |
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యనంగా మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు బలహీన పడటంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా అమెరికా మార్కెట్లు ప్రతికూలంగా క్లోజ్ అవ్వడంతో ఆసియా మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ట్రేడింగ్ చేశారు. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని నిపుణులు తెలిపారు. ప్రారంభం నుంచే మార్కెట్లు డీలాపడటంతో చివరివరకూ కొనుగోళ్ల మద్దతు లభించలేదని నిపుణులు వివరించారు.

అలాగే, మార్కెట్ల ధోరణి ఇలాగే ఉంటే దేశ వృద్ధి రేటు 8.2 శాతానికి క్షీణించవచ్చని ఫిచ్ అంచనా వేయడం, ఇటీవల ట్రేడింగ్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లకు ప్రతికూలత తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 340.60 పాయింట్లు కోల్పోయి 49,161 వద్ద ముగియగా, నిఫ్టీ 91.60 పాయింట్లు నష్టపోయి 14,850 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల్లో లాభాల స్వీకరణ నమోదైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.36 వద్ద ఉంది.


Next Story

Most Viewed