వారాంతం నష్టాలను ఎదుర్కొన్న సూచీలు!

by  |
markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాలను ఎదుర్కొన్నాయి. గత మూడు సెషన్లుగా అధిక లాభాలతో పుంజుకున్న సూచీలు వారాంతం లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనబడింది. మరోవైపు కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పలు ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా కూడా ఒమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయని విశ్లేషకులు తెలిపారు. గత మూడు రోజుల్లో వచ్చిన లాభాలు వారం ప్రారంభంలో నమోదైన నష్టాల రికవరీనే. స్టాక్ మార్కెట్‌లో పరిస్థితులు ఇప్పటికీ ప్రతికూలంగానే భావించవచ్చు. దీనివల్లే పెట్టుబడిదారులు అమ్మకాలకు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు దేశీయంగా కీలక సంఘటనలు లేకపోవడంతో గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడవుతున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 190.97 పాయింట్లు కోల్పోయి 57,124 వద్ద, నిఫ్టీ 68.85 పాయింట్లు క్షీణించి 17,003 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంకింగ్, ఆటో రంగాలు నీరసించాయి. ఐటీ ఇండెక్స్ మాత్రమే స్వల్పంగా పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, డా రెడ్డీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.01 వద్ద ఉంది.



Next Story