వరుస రికార్డు లాభాలకు బ్రేక్!

by  |
Sensex Brek
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డు లాభాలను బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభంలో సానుకూలంగా మొదలైనప్పటికీ అనంతరం లాభాల స్వీకరణకు మదుపర్లు ఆసక్తి చూపించడంతో క్రమంగా సూచీలు నష్టపోయాయి. మిడ్-సెషన్ నుంచి తీవ్రంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి కీలక కంపెనీల షేర్లు నష్టపోవడంతో దిద్దుబాటు దిశగా మార్కెట్లు పయనించాయి. మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలను సూచీలు తాకాయని, అయితే వెంటనే లాభాల స్వీకరణతో నష్టాల్లో జారినట్టు విశ్లేషకులు తెలిపారు. దీంతో వరుసగా నాలుగు సెషన్లలో రికార్డు లాభాలు చూసిన సెన్సెక్స్ ఇండెక్స్, 7 రోజుల పాటు జోరుగా ఉన్న నిఫ్టీలు నష్టాలను చూశాయి.

ఇదే సమయంలో ఈ ఏడాది నిఫ్టీ అత్యధిక రోజుల పాటు లాభాలను కొనసాగించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 214.18 పాయింట్లు కోల్పోయి 57,338 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 55.95 పాయింట్లు నష్టపోయి 17,076 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ రంగం 5 శాతానికి పైగా పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంకింగ్, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్, మీడియా రంగాలు స్వల్పంగా బలపడ్డాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, ఎల్అండ్‌టీ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.08 వద్ద ఉంది.


Next Story

Most Viewed