వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by  |
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం నాటి భారీ నష్టాల తర్వాత వారాంతం కూడా సూచీల ధోరని మారలేదు. శుక్రవారం మిడ్-సెషన్‌కు ముందు లాభాల వైపుకు పయనిస్తున్నట్టు కనిపించినప్పటికీ తిరిగి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి.

ముఖ్యంగా హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా అమ్మకాలకు గురి కావడంతో వరుసగా మూడోరోజూ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ భారతీయ ఈక్విటీలను డౌన్‌గ్రేడ్ చేయడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు స్థిరంగా విక్రయాలకు దిగారు. దీనివల్ల భారతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 677.77 పాయింట్లు కోల్పోయి 59,306 వద్ద, నిఫ్టీ 185.60 పాయింట్ల నష్టంతో 17.671 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్ రంగాలు పతనమయ్యాయి. ఆటో, ఫార్మా, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకి, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద ఉంది.


Next Story