వరుసగా రెండో రోజూ డీలాపడిన మార్కెట్లు..

by  |
వరుసగా రెండో రోజూ డీలాపడిన మార్కెట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య బుధవారం నష్టపోయాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు చివరివరకు ఊగిసలాట ధోరణిలోనే ర్యాలీ చేశాయి. మిడ్-సెషన్ నుంచి లాభాల నష్టాల మధ్య కదలాడిన తర్వాత ఐటీ, టెలికాం, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా డీలాపడ్డాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఇంధన రంగాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి. దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఈ క్రమంలో గత కొన్ని సెషన్లుగా రికార్డు లాభాలను సాధించిన తర్వాత వరుసగా రెండో రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 29.22 పాయింట్లు కోల్పోయి 58,250 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 8.60 పాయింట్లు నష్టపోయి 17,353 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం మెరుగైన లాభాలతో పుంజుకోగా, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, టైటాన్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.57 వద్ద ఉంది.



Next Story

Most Viewed