ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!

104
sensex

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గతవారం జీవితకాల గరిష్ఠాలతో సరికొత్త రికార్డులను చూసిన సూచీలు ఈ వారం లాభాల స్వీకరణకు నెమ్మదించాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక మద్దతు కారణంగా భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు 60,412 వద్ద జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. అనంతరం గరిష్ఠాల వల్ల మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోవడంతో చివర్లో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో మరింత నీరసించాయి. మిడ్-సెషన్ తర్వాత లాభనష్టాల మధ్య ర్యాలీ చేసిన తర్వాత చివర్లో ఫ్లాట్‌గా ముగిశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 29.41 పాయింట్ల లాభంతో 60,077 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 1.90 స్వల్ప పాయింట్లు లాభపడి 17,855 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ అత్యధికంగా 3.2 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు లాభపడ్డాయి. ఐటీ రంగం 3 శాతం పతనమైంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.82 వద్ద ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..