ఐటీ మద్దతుతో మరోసారి రికార్డు ర్యాలీ!

32

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డులే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ప్రతి సెషన్‌కూ ఒక కొత్త రికార్డు, సరికొత్త జీవితకాల గరిష్ఠంతో ర్యాలీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్ మెరుగైన ఫలితాలను వెల్లడించడం, రానున్న ఐటీ కంపెనీల ఫలితాలు ఇదే స్థాయిలో వృద్ధిని సాధిస్తాయనే నమ్మకంతో ఐటీ షేర్లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. దీంతో సోమవారం మార్కెట్లు మరోసారి కీలక మైలురాయిని అధిగమించాయి. ప్రముఖ సూపర్‌మార్ట్ డీ-మార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్కెట్ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో రంగాల మద్దతుతో ఉదయం ప్రారంభంలోనే రికార్డు స్థాయిలను చేరుకున్నాయి.

అనంతరం 49వేల మార్కును చేరుకుని ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకాయి. నిఫ్టీ సైతం 14,500 మార్కుకు చేరువలో ఉండటం విశేషం. మిడ్‌సెషన్ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో కొంత తగ్గినా, వెంటనే కోలుకుని సెన్సెక్స్ 486.81 పాయింట్లు ఎగసి 49,269 వద్ద ముగియగా, నిఫ్టీ 137.50 పాయింట్లు లాభపడి 14,484 వద్ద ముగిసింది. నిఫ్టీలో అధికంగా ఐటీ రంగం 3 శాతానికిపైగా దూసుకెళ్లింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు పుంజుకోగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, ఓఎన్‌జీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎన్‌టీప్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.41 వద్ద ఉంది.