వరుసగా మూడోరోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం ఉదయం నుంచే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాలను కొనసాగించాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారని, దీనికి తోడు ప్రపంచ మార్కెట్లతోపాటు భారత స్టాక్ మార్కెట్లు కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇక దేశీయంగా ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో నమోదవడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సహా కీలక కంపెనీలు షేర్లు దెబ్బతినడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 166.33 పాయింట్లు కోల్పోయి 58,117 వద్ద, నిఫ్టీ 43.35 పాయింట్లు నష్టపోయి 17,324 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు నీరసించాయి. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, డా. రెడ్డీస్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.86 వద్ద ఉంది.

Next Story