సరికొత్త రికార్డులను సాధించిన స్టాక్ మార్కెట్లు

by  |
Stak-Market1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డులను బద్దలు చేశాయి. రెండు వారాల క్రితమే బీఎస్ఈ సెన్సెక్స్ కీలక 60,000 మార్కును అధిగమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వెయ్యి పాయింట్లు జోడించి 61,000 పాయింట్ల మైలురాయిని దాటింది. వరుస ఆరు రోజుల లాభాలతో దూసుకెళ్లిన సూచీలు రికార్డు స్థాయిలను తాకాయి. ఉదయం లాభాలతో మొదలైన తర్వాత కొంత సమయం ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత మిడ్-సెషన్ సమయం నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ర్యాలీ చేశాయి. దేశీయంగా కీలక రంగాల్లోని దిగ్గజ కంపెనీల షేర్ల కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపించడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులు అత్యధికంగా వచ్చి చేరుతున్నాయి. దీనికితోడు దేశీయంగా ఐపీఓలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

అంతేకాకుండా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం.. కొవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం కేంద్రం తీసుకునే సంస్కరణలతో దలాల్ స్ట్రీట్ కొన్నాళ్లుగా కొనుగోళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఇండెక్స్ మరోసారి 61 వేల మార్కును చేరుకుంది. గురువారం ట్రేడింగ్‌లో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 568.90 పాయింట్లు ఎగసి 61.305 వద్ద, నిఫ్టీ 176.80 పాయింట్లు ర్యాలీ చేసి 18,338 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో మినహా అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం కొనుగోళ్ల జోరును కొనసాగించింది. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, ఎనర్జీ, మెటల్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్ షేర్లు అత్యధిక లాభాలతో దూసుకెళ్లాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.25 వద్ద ఉంది.

రిలయన్స్ రూ. 17 లక్షల కోట్లకు..
దేశీయ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకెళ్తుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సాధించింది. సంస్థ షేర్లు గురువారం 1 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ. 2,695.90 వద్ద ట్రేడయ్యి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారత కంపెనీల్లోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17 లక్షల కోట్లను చేరుకుంది. గత నెల చివర్లోనే సంస్థ మార్కెట్ క్యాప్ మొదటిసారిగా రూ. 16 లక్షల కోట్ల మార్కును తాకింది. ఆ తర్వాత కేవలం 10 సెషన్లలో సంస్థ అదనంగా మరో రూ. లక్ష కోట్లను జమ చేసుకుంది. ఈ ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ మార్కెట్ క్యాప్ గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరగడం గమనార్హం.


Next Story

Most Viewed