రికార్డుల జోరులో స్టాక్ మార్కెట్లు

by  |
bull
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులతో దూసుకెళ్తున్నాయి. ఇటీవల కీలకమైన 56 వేల మార్కును చేరుకున్న సూచీలు అత్యంత తక్కువ వ్యవధిలో 57 వేల మార్కును చేరుకున్న చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా అనుకూల పరిస్థితుల నేపథ్యంలో సూచీలు సోమవారం నాటి ధోరణిలోనే కదలాడాయి. అంతేకాకుండా ఇటీవల రూపాయి మారకం విలువ బలపడుతుండటం కూడా స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం ప్రారంభంలో కొంతమేర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి గంటలో దూసుకెళ్లాయి.

గత మూడు సెషన్లలో స్టాక్ మార్కెట్లు చివరి గంటలోనే రికార్డు లాభాల వద్ద ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 662.63 పాయింట్లు ఎగసి 57,552 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 201.15 పాయింట్లు పెరిగి 17,132 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పయింట్, టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి.


Next Story

Most Viewed