లాభాల స్వీకరణతో వారాంతం భారీ నష్టాలు!

by  |
లాభాల స్వీకరణతో వారాంతం భారీ నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. దేశీయంగా పలుచోట్ల కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలను దెబ్బతీశాయి. శుక్రవారం ఉదయం కొద్దిసేపు లాభాల్లో ట్రేడయిన సూచీలు ఆ తర్వాత గంటకే నష్టాల్లోకి జారాయి. మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో పాటు గత రెండు సెషన్లు గా కొనసాగుతున్న గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం వల్లనే వారాంతం నష్టాలు ఏర్పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 764.83 పాయింట్లు పతనమై 57,696 వద్ద, నిఫ్టీ 204.95 పాయింట్లు నష్టపోయి 17,196 వద్ద ముగిసింది. నిఫ్టీలో హెల్త్‌కేర్ ఇండెక్స్ అధికంగా 1.2 శాతం క్షీణించింది. మీడియా రంగం మినహా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడి కారణంగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి.

మిగిలిన అన్ని షేర్లు పతనమయ్యాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడ్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఐటీసీ, సన్Fఆర్మా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.11 వద్ద ఉంది.


Next Story

Most Viewed