గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీఎం కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-22 10:58:33  IST  )

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ పరిధిలో ఉన్న పురనియా ప్రాంతంలో సోమవారం ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ పరిధిలో ఉన్న పురనియా ప్రాంతంలో సోమవారం ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు క్రమంగా భవనమంతా వ్యాపించడంతో తీవ్ర ఆందోళన, గందరగోళ వాతావరణం నెలకొంది. భవనంలో కోచింగ్ సెంటర్, లైబ్రరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ.. సీనియర్ పోలీస్ అధికారులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఆ భవనం పై అంతస్తులో ఓ గేమింగ్ జోన్ ఉందని, గ్రౌండ్ ఫ్లోర్లో పెట్ షాప్ ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో గేమింగ్ జోన్ లో ఉద్యోగులు చిక్కుకున్నట్లు తెలిపారు. వీరిలో కొందరు ప్రాణభయంతో బిల్డింగ్ పైనుంచి దూకేయగా.. గాయాలయ్యాయి. మొత్తం 12 మందిలో ఐదుగురు బయటికి రాగా.. మరికొందరు లోపలే చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా చర్యలు చేపట్టారు. మంటలు ఎగసి పడుతుండగా.. వాటిని అదుపుచేసేందుకు 14 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా.. కొన్ని జాతీయ మీడియాలు ఆ భవనంలో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ఉన్నట్లు కథనాలు రాశాయి. ఆ భవనంలో ఉన్నది గేమింగ్ జోనా? ఇనిస్టిట్యూటా అన్నదానిపై క్లారిటీ రావలసి ఉంది.

Next Story