జీవితకాల గరిష్ఠాలకు చేరిన స్టాక్ మార్కెట్లు!

77
Sensex

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీగా లాభాలను సాధించాయి. ప్రారంభంలో స్వల్ప సానుకూలతను చూసిన సూచీలు మిడ్-సెషన్ నుంచి గణనీయమైన లాభాలతో జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. ప్రధానంగా టాటా మోటార్స్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కీలక మద్దతునిచ్చాయి. మంగళవారం టాటా మోటార్స్ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీగా పెట్టుబడులను రాబట్టుకోవడంతో కంపెనీ షేర్లు ఏకంగా 21.11 శాతానికి పైగా పుంజుకున్నాయి. గత రెండు సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మద్దతినిచ్చే సంఘటనల కారణంగా మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి.

ప్రధానంగా సెన్సెక్స్ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో 60,836 వద్ద, నిఫ్టీ 18,197 ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి చేరుకోవడం, పారిశ్రామికోత్పత్తి మెరుగ్గా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలంగా మారింది. అలాగే, దేశీయ విమానయాన ప్రయాణానికి పూర్తి సామర్థ్యం కోసం అనుమతివ్వడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 452.74 పాయింట్లు ఎగసి 60,737 వద్ద, నిఫ్టీ 169.80 పాయింట్లు పెరిగి 18.161 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఆటో ఇండెక్స్ అత్యధికంగా 3.5 శాతం పుంజుకుంది. ఎనర్జీ, ఐటీ, మెటల్, ఇన్‌ఫ్రా రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టైటాన్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా షేర్లు నష్టలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.36 వద్ద ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..