లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు

by  |
stock markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత వరకు మెరుగైన ర్యాలీని నిర్వహించాయి. చివరి గంటలో ఆశించిన స్థాయిలో సానుకూల సంకేతాలు కరువవ్వడంతో స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ప్రధానంగా చివరి గంట సమయంలో అమ్మకాల ఒత్తిడి అధికంగా మారడంతో నష్టాలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొవిడ్ కొత్త వేరియంట్ భయాలు కొనసాగుతుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీనికి తోడు సాయంత్రానికి దేశీయంగా పరిస్థితులు ప్రతికూలంగా మారడం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సహా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో సూచీలు దెబ్బతిన్నాయని మార్కెట్ పరిశీలకులు వెల్లడించారు. ఉదయం ప్రారంభంలో ఉన్న స్థాయిలో బలమైన సంకేతాలు లేకపోవడం వల్లనే స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టపోయాయని నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 195.71 పాయింట్లు కోల్పోయి 57,064 వద్ద, నిఫ్టీ 70.75 పాయింట్లు నష్టపోయి 16,983 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 2 శాతానికి పైగా నీరసించగా, బ్యాంకులు, ఆటో, విద్యుత్ రంగాలు బలహీనపడ్డాయి. ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.18 వద్ద ఉంది.



Next Story