రికార్డ్ బ్రేక్స్ : సెన్సెక్స్ @44,000

by  |
రికార్డ్ బ్రేక్స్ : సెన్సెక్స్ @44,000
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను బద్దలు కొట్టాయి. వరుస మూడు రోజుల ర్యాలీతో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠం 44,000 మార్కును దాటేసింది. గతవారమే 43 వేల స్థాయిని దాటిన సెన్సెక్స్ కేవలం ఎనిమిది రోజులకు మరో మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రధానంగా కొవిడ్-19కు సంబంధించి పలు దేశాల వ్యాక్సిన్‌లపై పురోగతి కనిపిస్తుండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరీక్షలు చాలావరకు 90 శాతానికిపైగా ప్రభావం చూపిస్తుండటంతో మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 227.34 పాయింట్లు ఎగసి 44,180 వద్ద ముగియగా, నిఫ్టీ 64.05 పాయింట్లు లాభపడి 12,938 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాలు 2 శాతానికిపైగా పుంజుకోగా, మెటల్ మీడియా రంగాలు స్వల్పంగా బలపడ్డాయి.

ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం షేర్లు భారీగా 10 శాతానికిపైగా పుంజుకున్నాయి. ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాక్, మారుతీ సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, టైటాన్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.20 వద్ద ఉంది.


Next Story