‘స్వార్థం’ ఓ మానసిక రోగం.. మారకపోతే అంతే సంగతులు!

by  |
‘స్వార్థం’ ఓ మానసిక రోగం.. మారకపోతే అంతే సంగతులు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఎవరిని కదిలించినా.. ఇది స్వార్థపు ప్రపంచమనే అంటుంటారు. అందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే, మనలో స్వార్థముంటే మాత్రం తప్పకుండా మార్చుకోవాల్సిందే. ఎందుకంటే.. ‘స్వార్థం’ ఓ మానసిక రోగం. ఇదేదో ఊరికే చెబుతున్న మాట కాదు.. డాక్టర్లు కూడా దీనిని నిర్ధారించడం గమనార్హం.

మన గురించి మనం ఆలోచించుకోవడం ఉత్తమమే.. కానీ పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడం లేదా వాళ్లు ఏమైపోయినా పర్వాలేదనుకునే మనస్థత్వం ఉంటే మాత్రం వీలైనంత త్వరగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోక తప్పదు. నిజానికి ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం ఉంటుంది. అయితే అది శృతిమించితేనే అసలు సమస్య. సైకాలజిస్టులు సైతం స్వార్థమనేది ఓ మానసిక రోగమని చెబుతుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వైద్య పరిభాషలో దీన్ని ‘నర్‌సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (NPD- NARCISSTIC Personality Disorder)’ అని అంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో వాదించే గుణం ఎక్కువ. ఇతరులను అతిగా దూషించడం, తమకు కావల్సినవి ఎలాగైనా సాధించేందుకు డిమాండ్స్ చేయడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా స్నేహితురాలు, సహోద్యోగి, జీవిత భాగస్వామి.. ఎవరైనా కావచ్చు. తమతోనే మాట్లాడాలి, తమకే సమయం కేటాయించాలి అనుకోవడం, ఇతరులతో మాట్లాడితే సహించలేకపోవడం వంటివి చేస్తుంటారు. యుక్త వయసులో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ఎన్‌పీ‌డీ ఉన్న వ్యక్తులు తమను తాము ప్రత్యేకంగా భావిస్తారు. తాము తప్పు చేసినా, కరెక్ట్‌గా చేశామనే భావనే వారిలో స్ఫురిస్తుంది. ఇంకా కొందరు తమ తోటి ఉద్యోగులను తక్కువచేసి చూపిస్తూ తమని తాము ప్రమోట్ చేసుకుంటూ కెరీర్‌‌లో ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ఎన్సీడీ సమస్య పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. విద్యార్థి దశలో.. తోటి విద్యార్థులతో పోటీపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకోవాలనే పట్టుదల.. క్రమేణా వారికి తెలియకుండానే ఎన్‌పీడీలోకి తీసుకెళ్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ డిజార్డర్ ఏర్పడటానికి సరైన కారణం ఏమిటనేది ఇప్పటికీ అంతుచిక్కకపోవడం విశేషం. అయితే కొందరికి మాత్రం వారి పెద్దల నుంచి కూడా ఇది సంక్రమిస్తుందనే వాదన ఉంది. ఎన్పీడీ కొంతమందికి సమాజంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మరికొందరిని సమాజానికి, బాంధవ్యాలకు దూరం చేస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. కనీస విలువలు మరిచిపోయి సొంతవారితో కూడా కఠినంగా ప్రవర్తించేలా చేస్తుంది.

మరి దీనికి చికిత్స లేదా అంటే.. ఉంది. ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన వ్యాధి. తాము చేసిన తప్పులను గ్రహించగలిగేలా సైకోథెరఫీని ఇవ్వాల్సి ఉంటుంది. తరచుగా మానసిక వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ వ్యాధిని కొంత మేరకు తగ్గించవచ్చు.


Next Story

Most Viewed