పురుగుల మందు చూపిస్తూ సెల్ఫీ వీడియో.. గ్రామస్తులు వెళ్లేలోపు

by  |
పురుగుల మందు చూపిస్తూ సెల్ఫీ వీడియో.. గ్రామస్తులు వెళ్లేలోపు
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గొలుసుకట్టు మోసాలు తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు ఒక గొలుసుకట్టు సంస్థలో డబ్బులు చెల్లించగా.. ఏజెంట్ అవి ఇవ్వకపోవడంతో బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కి తరలించగా.. ఇవాళ డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.

మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన అంజాద్ అనే యువకుడు ఒక గొలుసుకట్టు సంస్థలో ఇటీవల రూ.లక్షా 20 వేలు పెట్టుబడి పెట్టాడు. కొద్దిరోజుల్లోనే డాలర్ల రూపంలో రెట్టింపు డబ్బు వస్తుందని ఏజెంట్ ఆశ చూపాడు. అయితే డబ్బులు ఇవ్వాలని ఇటీవల ఏజెంట్ ఇంటివద్దకు అంజాద్ వెళ్లగా.. కుటుంబ సభ్యులతో కలిసి అంజాద్‌ను ఏజెంట్ మెడపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అంజాద్ పురుగుల మందు తీసుకుని తన గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి తన బాధను చెప్పుకుంటూ సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు.

ఈ సెల్ఫీ వీడియోను గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేసాడు. గ్రామస్తులు వెంటనే గమనించి అంజాద్ ఉన్న ప్రాంతానికి చేరుకునేలోపు అతడు పురుగుల మందు తాగేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అంజాద్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకుని ఇవాళ అంజాద్ డిశ్చార్జ్ అయ్యాడు.



Next Story