స్కూల్స్ ఓపెన్: విడతల వారీగా క్లాసులు

by  |
School Reopening soon Guidelines and Rules
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. జులై 1 నుంచి 8,9,10 తరగతుల విద్యార్థులకు, జులై 20 నుంచి 6,7 విద్యార్థులకు, ఆగస్ట్ 18 నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు నివేదికలను సిద్ధం చేశారు. కోర్ట్‌లో విద్యాసంస్థల ప్రారంభంపై కేసు నడుస్తుండటంతో ప్రకటనను నిలిపివేశారు. జూన్ 25 నుంచి పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులు మౌళిక సదుపాయాలను కల్పించి పాఠశాలను సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. విద్యాసంస్థల సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది.

విద్యాసంస్థలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకొని తరగతుల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. జూనియర్ కళాశాలలను జులై 1 నుంచి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించినప్పటికి పాఠశాల తరగతుల నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. పాఠశాలల నిర్వహణపై కోర్ట్ లో కేసు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ప్రకటనను నిలిపివేసారు. కోర్ట్ తీర్పు వెలువడిన అనంతరం తరగతుల నిర్వహణ సమయాలను ప్రకటించనున్నారు.

విడతల వారీగా ప్రారంభం కానున్న తరగతులు

తరగతుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో చర్చించి నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. మొదటగా జులై 1 నుంచి 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్దతుల ద్వారా తరగతులను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 6, 7 తరగతులను జులై 20 నుంచి, 3, ,4 ,5 తరగతులకు ఆగస్ట్ 16న నిర్వహించేందుకు తేదీలను నిర్ణయించారు.

టీచర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్

పాఠశాలలు ప్రారంభించే లోపు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో మొత్తం 4,87,902 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో టీచింగ్ సిబ్బంది 3,83,332 మంది, 1,04,570 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. పాఠశాల విద్యలో మొత్తం 3,52,011 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో టీచింగ్ సిబ్బంది 2,86,097 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 65,914 మంది ఉన్నారు. జూనియర్ కళాశాలల్లో 40,212 మంది సిబ్బంది ఉండగా.. టీచింగ్ సిబ్బంది 37,422 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 2,790 మంది ఉన్నారు. టెక్నికల్ ఎడ్యూకేషన్ లో 7,804 మంది సిబ్బంది ఉండగా.. టీచింగ్ సిబ్బంది 5,372 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 2,432 మంది ఉన్నారు. వెల్ ఫేర్ డిపార్ట్ మెంట్ లో 23,374 మంది సిబ్బంది ఉండగా.. టీచింగ్ సిబ్బంది 16,140 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 7,243 మంది ఉన్నారు. వీరందరికి ఈ నెల 29 వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.


Next Story