ఇంకా తెరుచుకోని స్కూల్ తాళాలు

by  |
ఇంకా తెరుచుకోని స్కూల్ తాళాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బోధనకు అవసరమైన పద్ధతిలో స్కూళ్లను సిద్ధం చేసి రిపోర్టును ఈ నెల 18న అందజేయాలంటూ విద్యాశాఖ తాజాగా సూచించింది. ప్రకటించి నాలుగు రోజులైనా ఇప్పటికీ ప్రధానోపాధ్యాయులకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో ఇంకా స్కూళ్ల తాళాలు తెరుచుకోలేదు. మరో పది రోజుల్లో స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో హడావిడిగా ఆదేశించినా క్షేత్రస్థాయిలో కదలికలు లేకపోవడం గమనార్హం. 9, 10 తరగతులకు సంబంధించి భౌతిక తరగతులు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. క్లాసులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ స్కూళ్లు నిర్వహిం చేలా, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కలెక్టర్ చైర్మన్​గా తొమ్మిది మంది సభ్యులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 18న ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలను జిల్లా విద్యాధికారులకు అందించాలని సూచించింది. శనివారం రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ కూడా తెరుచుకోలేదు. తమకు అధికారిక ఉత్తర్వులు, సూచనలు అందలేదని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ హెడ్మాస్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించకపోయినా సర్పంచ్, పంచాయతీ సిబ్బంది సాయంతో స్కూల్‌ పరిశుభ్రత పనులు మొదలు పెట్టినట్టు మరో ఉపాధ్యాయుడు చెప్పారు.

ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా కష్టమే..

ప్రస్తుతం 9, 10 తరగతులకు మాత్రమే క్లాసులు ప్రారంభిస్తున్నారు. ఒక్కో గదిలో 20 మందిని మాత్రమే అనుమతించేలా ఎస్‌ఓపీ సిద్ధం చేశారు. రాంనగర్ జమిస్తాన్‌పూర్ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో 33 మంది, పదో తరగతిలో 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో తరగతిలో 20-25 మంది వరకూ వస్తారని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో ఒక్కో క్లాసులో 40 -60 మంది ఉంటే పాఠాలు బోధించాలంటే ఉపాధ్యాయులు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక క్లాసులో 60 మంది ఉంటే ఒక్కో గదిలో 20 మంది చొప్పున ఒకే పాఠ్యాంశాన్ని మూడుసార్లు చెప్పాల్సి ఉంటుంది. అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నుంచి మార్గనిర్దేశకాలు అందలేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థులకు పాఠాలు అర్థం కావడం లేదని తేలిపోయిందని, స్కూళ్లను ప్రారంభించడం వల్ల విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన వివరించారు.

శానిటైజేషన్, మధ్యాహ్న భోజనం పరిస్థితి..

స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా అన్ని క్లాసులు కొనసాగుతున్నపుడే గిట్టుబాటు కావడం లేదంటూ ఏజెన్సీలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పుడు కేవలం రెండు తరగతుల విద్యార్థులకు వంట చేయడానికి ఏజెన్సీలు ముందుగా వస్తాయో, లేదోనని ప్రధానోపాధ్యాయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భోజన కార్మికులకు గతేడాదికి సంబంధించిన గౌరవ వేతనంతో పాటు బిల్లులు కూడా అందకపోవడంతో వారంతా ఆలోచనలో ఉన్నారు. 9, 10 తరగతులకు సంబంధించి భోజన ఖర్చులు పూర్తిస్థాయిలో రాష్టప్రభుత్వమే భరించాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకూ నిధుల విడుదల చేయలేదు. బియ్యం మాత్రమే చౌకడిపోల నుంచి వస్తుండగా మిగిలిన సరుకుల కోసం ముందుగా ఖర్చు చేసి తర్వాత బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఏడాదిగా వారికి ఆదాయం రాకపోవడం, పెండింగ్ బిల్లులు ఉండటంతో భోజన కార్మికులు కూడా వెంటనే సిద్ధం కాలేమని చెబుతున్నారు. విద్యార్థులకు అవసరమైన శానిటైజర్ల కోసం ఎస్ఎంసీ చైర్మన్​ ఖాతా ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఎలాంటి నిధులు తమ ఖాతాలలో జమ కాలేదని హెడ్మాస్టర్లు చెబుతున్నారు. నిధులు లేకుండా. మార్గనిర్ధేశకాలు అందకుండా రిపోర్టులు ఎలా అందించగలమని ప్రశ్నిస్తున్నారు.

సర్వీస్ పర్సన్స్ లేకుంటే కష్టమే..

రాష్ట్రంలో పనిచేస్తున్న 28 వేల మంది సర్వీస్ పర్సన్స్‌ను ప్రభుత్వం తొలగించింది. స్కూల్స్ ప్రారంభమయ్యాక శానిటైజేషన్, స్కూళ్ల పరిశుభ్రత ప్రధానంగా మారనుంది. టాయిలెట్లు, తరగతి గదుల శుభ్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు చేయలేని పరిస్థితి. ఈ బాధ్యతలను జీపీ, మున్సిపాలిటీ కార్మికులకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో స్కూల్ సమయానికి వారు అందుబాటులో ఉండరు. స్కూల్ సర్వీస్ పర్సన్స్ అయితే పాఠశాల సమయమంతా అందుబాటులో ఉండటం వల్ల అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుందని, విద్యార్థులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం కూడా సాధ్యమవుతుందని యాదాద్రి జిల్లా ప్రధానోపాధ్యాయుడు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం అవసరమైన వరకూ నెల వారీగానైనా సర్వీస్ పర్సన్స్‌ ను నియమించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed