సాదా బైనామా అప్లికేషన్ల తో దళారుల దందా...

by Ratna Kumari |   (  Updated:2026-05-06 09:54:25  IST  )

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ త‌హ‌శీల్దార్ కార్యాలయంలో సాదా బైనామా అప్లికేషన్ల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది.

సాదా బైనామా అప్లికేషన్ల తో దళారుల దందా...
X

దిశ, ధర్మసాగర్ : హన్మకొండ జిల్లా ధర్మసాగర్ త‌హ‌శీల్దార్ కార్యాలయంలో సాదా బైనామా అప్లికేషన్ల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా జీపీఓలు (గ్రామ పాలన అధికారులు) ప్రైవేట్ వ్యక్తులను మధ్య వర్తులుగా పెట్టుకుని దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాదా బైనామా లిస్టులో మీ పేరు ఉందంటూ ప్రైవేట్ వ్యక్తులు అర్జీదారులకు ఫోన్లు చేసి, ఫైలు ముందుకు కదలాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకు సంబంధించిన కీలక సమాచారం బయటకు ఎలా వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీపీఓ లే ఈ ప్రైవేట్ వ్యక్తులకు లిస్టు ఇచ్చి ఫోన్లు చేపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్జీదారుల ఆరోపణల ప్రకారం.. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫోన్ చేసి సాదా బైనామా లిస్టులో మీ పేరు ఉంది.

మీ భూమి సాదా బైనమా ద్వారా పట్టా చేపిస్తానని దానికి ఖర్చు అవుతుందని తెలిపినట్టు మరొకరికి ఫోన్ చేసి సాదాభైనామ ఎంక్వైయిరీ ముగిసింది ఫైలు ముందుకు వెళ్లాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని అడిగినట్లు ఆరోపస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే ఫైళ్లు వేగంగా కదులుతున్నాయని, ఎంక్వైరీ పూర్తయినా డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లు మాత్రం పెండింగ్‌లోనే ఉంచుతున్నారని అంటున్నారు. జీపీఓలే ఈ వ్యవహారానికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత లేకపోవడం వల్ల ఇలాంటి దందాలు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story