సత్య నాదెళ్లకు ‘సీ కె ప్రహ్లాద్’ అవార్డు

55
nadhella1

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు ప్రతిష్ఠాత్మక సీ కె ప్రహ్లాద్ ‘గ్లోబల్ బిజినెస్ సస్టయినబిలిటీ లీడర్‌షిప్’ అవార్డు వరించింది. 2021 ఏడాదికి గానూ ఈ అవార్డును ఆయనతోపాటు అదే సంస్థకు చెందిన మరో ముగ్గురికి ఇవ్వనున్నారు. కర్బన ఉద్గార రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్‌ను మార్చేందుకు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని వీరు ముగ్గురు అందుకున్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల్లోని ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలతోపాటు సుస్థిరత, ఆవిష్కరణలను సాధించిన భారత-అమెరికా సంతతి వ్యాపార దిగ్గజం సీ కె ప్రహ్లాద్ పేరున ఈ అవార్డును ఇస్తున్నారు. 2010 నుంచి కార్పొరేట్ ఎకోఫోరమ్(సీఈఎఫ్) వారు ప్రతి ఏటా దీన్ని అందిస్తున్నారు.

ఈ ఏడాదికి మైక్రోసాఫ్ట్ అధినేతతోపాటు సంస్థ వైస్-చైర్మన్ బ్రాడ్ స్మిత్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ లుకాస్ బొపా కలిసి ఈ అవార్డును అందుకున్నారు. 2030 నాటికి కర్బన ఉద్గార రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్‌ను నిలిపేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ‘ఒకే సంస్థ నుంచి నలుగురు వ్యక్తులు పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుండటం ఇదే మొదటిసారి. కార్పొరేట్ రంగంలో లీడర్‌షిప్ ఎలా ఉండాలనే దానికి వీరు ఉదాహరణగా నిలిచారని, మైక్రోసాఫ్ట్ వ్యాపార వ్యూహానికి స్థిరత్వం కీలకాంశం కావడం గొప్ప విషయమని’ సీఈఎఫ్ వ్యవస్థాపకుడు ఎం ఆర్ రంగస్వామి చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..