నత్తనడకన సాటిలైట్ మినీ బస్‌డిపో పనులు.. ఎప్పటికి పూర్తయ్యేనో..!

75

దిశ, ఇల్లందు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో సాటిలైట్ మినీ బస్‌డిపో పనులను తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 2021 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. దసరా పండుగ వరకు ఈ డిపో నిర్మాణం పూర్తవుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో సాటిలైట్ మినీ బస్ డిపో పనులు ఎప్పుడు పూర్తవుతాయో అని ఇల్లందు ప్రజలు ఆశగా ఎదురుచూస్తు్న్నారు. కనీసం ఎప్పుడు పూర్తవుతాయో అని అడిగితే అధికారుల నుంచి సమాధానం కరువైంది. అంటే ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతాయో వారికే క్లారిటీ లేదు. డిపో నిర్మాణ పనులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా నేటికి కనీసం బేస్‌మెంట్ కూడా పూర్తి కాలేదు. కేవలం గుంతలు తవ్వి వదిలేశారు. పనులు ఇలాగే నత్తనడకన సాగితే ఎప్పటికి ఈ డిపో పూర్తవుతుందో అని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిబ్రవరి 5న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.3 కోట్ల ఇరవై ఐదు లక్షలతో సాటిలైట్ మినీ బస్ డిపో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు జరిగిన కార్యక్రమంలో దసరా పండుగ నాటికి సాటిలైట్ మినీ బస్ డిపోను ప్రారంభించుకుందామని చెప్పారు. దసరా పండుగ రావడమే కాదు.. మరో రెండ్రోజుల్లో వెళ్లిపోతుంది కూడా. కానీ, మంత్రి ఇచ్చిన హామీ మాత్రం ఇప్పటికీ నెరవేర్చకపోవడం ఇక్కడి అభివృద్ధి పనుల పట్ల పాలకులకు, అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడ డిపో పనులు త్వరగా పూర్తవుతే ఇల్లందు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కొంత సౌకర్యంగాను, ఇబ్బందులు కూడా తప్పుతాయని ప్రజానీకం ఎదురుచూస్తోంది. బస్ డిపో పనులే ఇంకా పూర్తి కాలేదు. మంత్రి పువ్వాడ హామీ మేరకు రైల్వే‌స్టేషన్ పునరుద్ధరణ పనులు ఇంకెప్పుడు ప్రారంభిస్తారోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..