భైంసా.. తేరుకుంటుందా.!

by  |
భైంసా.. తేరుకుంటుందా.!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణం క్రమంగా తేరుకుంటోంది. ఈ నెల ఏడున చోటు చేసుకున్న ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో కఠిన ఆంక్షలు పెట్టారు. గత ఆదివారం రాత్రి నుంచి భైంసా పట్టణంలో 144సెక్షన్ అమలు చేస్తుండగా.. ఈ నెల 20వరకు ఈ 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ప్రస్తుతం భైంసాలో క్రమంగా జనజీవనం తేరుకుంటోంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జన జీవనం యథావిధిగా కొనసాగుతుండగా మధ్యాహ్నంనుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉన్నందున.. క్రమంగా ఆంక్షలను సడలించాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భైంసా పట్టణంలో గత ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఏవైనా పనులు ఉంటే.. పక్క జిల్లాకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కనే గోదావరి ఉండగా నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు వెళ్లి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కి వెళ్లి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్నారు. సోమ మంగళవారాల్లో బ్యాంకుల సమ్మె ఉండటంతో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించే పరిస్థితి లేకపోగా.. బుధవారం నుంచి ఈ సేవలను పునరుద్ధరిస్తారని చెబుతున్నారు.

జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ భైంసాలోనే మకాంవేయగా.. నాలుగు జిల్లాల పోలీస్ యంత్రాంగం భద్రత కోసం వినియోగిస్తున్నారు.. ఇప్పటివరకు 28 కేసులు నమోదు చేసి.. 45 మందిని అరెస్టు చేశారు. మరో 29 మంది పరారీలో ఉండగా వీరి కోసం గాలింపు చేస్తున్నారు. 65మందిని బైండోవర్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. గత వారం రోజులుగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed