ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ క్రిమినల్ మైండ్ అధికారి : మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ఓ క్రిమినల్ మైండ్ అధికారి : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, నిజామాబాద్ సిటీ : టీఎస్ ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బకాయిలు మొత్తం చెల్లించినా.. కావాలని పోలీసులు, ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు. తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ మాత్రం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారన్నారని ఆరోపించారు. సజ్జనార్ ది క్రిమినల్ మైండ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్టీసీ షాపుల వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి చెల్లించలేదని.. ఇది రూ. వందల కోట్ల స్కాం అని విమర్శించారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలో రూ.3 వేల కోట్లు సంపాదించారని.. ప్రముఖ విల్లాల్లో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయని.. అన్ని కేసులు బయటకు తీస్తానని పేర్కొన్నారు.

డీజిల్, స్క్రాప్, టైర్లు, కొత్త బస్సుల కొనుగోలు పేరిట కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసైగల్లో పనిచేస్తున్నాడని.. సజ్జనార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు కాంగ్రెస్ ఓటు వేయాలని ప్రజలకు వివరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశిస్తున్నారని, రాజ్యసభ సీటు కోసం ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఫార్మాలను బెదిరించి రూ.వందల కోట్ల మందులు తీసుకుని కర్నాటకకు పంపించారని దుయ్యబట్టారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed