'మేడం.. మీరు మా తల్లి వయసు ఉంటారు.. ఇకనైనా మారండి' లేడీ ఐఏఎస్ పై సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల ఆగ్రహం

by Disha Web Desk 13 |
మేడం.. మీరు మా తల్లి వయసు ఉంటారు.. ఇకనైనా మారండి లేడీ ఐఏఎస్ పై సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో:సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ మరణానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఐఏఎస్(రిటైర్డ్) కారణం అంటూ ఆమె చాంబర్ లో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె వేధింపులు తాళలేకే రాహుల్ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఉద్యోగులు సైతం మీ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు. సెక్రటేరియట్ లో మీరు చాలా సీనియర్ ఆఫీసర్ అని.. ఈ వయసులో మేము మీకు చెప్పాల్సిన అవసరం రాకూడని. మా తల్లి వయసు మీకు ఉంటుంది. ఇకనైనా మారాలని లేకుంటే పర్యవసానాలు మరో రకంగా ఉంటాయని హెచ్చరించారు. పురానాపూల్ కు చెందిన 33 ఏళ్ల రాహుల్.. కార్మిక, ఉపాధి కల్పన శాఖ పేషీలో ఔట్ సోర్స్ కింద 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం రాహుల్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అతడిని హుటాహుటీన నిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు హార్ట్ సర్జరీ తో పాటు డయాలసిస్ చేశారు. అబ్జర్వేషన్ లో ఉంచగా నిన్న రాత్రి 9 గంటలకు రాహుల్ మరణించారు.


ఈ నేపథ్యంలో రాణి కుముదిని వేధింపులే రాహుల్ మరణానికి కారణం అని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో శుక్రవారం సెక్రటేరియట్‌లోని రాణి కుముదిని ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీ వల్ల మహిళా ఉద్యోగులతో పాటు సిబ్బంది మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని సీఎస్, సీఎంవో దృష్టికి సైతం తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఉద్యోగులను ఆసుపత్రికి వెళ్లొద్దని, ఎవరితోను మాట్లాడవద్దని ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిడుతున్నారని, ఇదొక్కటే డిపార్ట్మెంట్ పని చేస్తోందా? సెక్రటేరియట్ లో వేరే ఇతర డిపార్ట్ మెట్లు పని చేయడం లేదా? అని ప్రశ్నించారు. మీరు ఉద్యోగులను వేధించకుంటే మీపై ఎందుకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు నిలదీశారు. మీకు భయపడి ఉద్యోగులెవరూ వారి ఇబ్బందులను ఇన్నాళ్లు బయటకు చెప్పలేదని రాహుల్ చనిపోవడంతో భరించలేక తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed