బ్యాటరీల వేస్టేజ్‌ను తగ్గించే ‘సోలార్ రిమోట్’

38

దిశ, వెబ్‌డెస్క్ : కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పాటు సాంకేతికతో కూడిన గృహోపకరణాల వాడకం పెరుగుతుండటంతో ఈ–వేస్ట్‌ కూడా అంతకు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగవుతుండగా, వాటిని కూడా సాధారణ చెత్తతో కలిపి పడేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ-వేస్ట్ మహా ముప్పుగా పరిణమించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ రూపొందిస్తుండగా.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ తమ ‘గోయింగ్ గ్రీన్’ స్కీమ్‌లో భాగంగా సోలార్ రిమోట్‌ను తయారుచేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇవి త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.

సాధారణంగా ట్రిపుల్ బ్యాటరీలతో ఉండే టీవీ రిమోట్స్ అన్నీ 6 నెలల్లోనే ఎక్స్‌పైరీ అవుతుంటాయి. ఆ తర్వాత వీటిని బయటపడేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాగా సౌత్ కొరియన్ కంపెనీ శాంసంగ్ ‘సోలార్ టీవీ’ రిమోట్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. ఈ మేరకు ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో 99 మిలియన్ బ్యాటరీ వ్యర్థాలకు అడ్డుకట్ట వేసే చాన్స్ ఉంది. సోలార్ టీవీ రిమోట్ టాప్‌లో చాలా సన్నని సోలార్ ప్యానల్‌ను ఫిట్ చేయగా, ఇది సూర్యరశ్మి సాయంతోనే కాకుండా గదుల్లో ఉండే ఆర్టిఫిషియల్ లైట్‌తోనూ రీచార్జ్ అవుతుంది. అంతేకాదు కేబుల్ సాయంతో కరెంట్ ద్వారా కూడా వీటిని చార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రిమోట్‌లను రీసైకిల్డ్ బాటిల్స్ నుంచి ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేయడం విశేషం. తాము ఈ ఏడాది నుంచి తీసుకురాబోయే టీవీల ప్యాకేజింగ్‌ కూడా ఎకో ఫ్రెండ్లీకీ అనుకూలంగా ఉంటుందని శాంసంగ్ ప్రకటించింది. ఇందులో భాగంగా పర్యావరణానికి హానిచేసే ఆయిల్ బేస్డ్-ఇంక్‌ను తగ్గించేందుకు ప్యాకేజింగ్‌పై ఇమేజ్, టెక్ట్స్ సైజ్ తగ్గిస్తున్నట్లు తెలిపింది.