- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా వనదేవతల జాతర.. నేడు గద్దెకు రానున్న సమ్మక్క
వైభవంగా వనదేవతల జాతర..

దిశ, హుజురాబాద్ రూరల్: గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట మండలంలోని జూపాక గ్రామాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య బుధవారం రాత్రి సారలమ్మ తల్లి గద్దెపై కొలువుదీరింది. రంగనాయకుల గుట్ట, జూపాక ప్రాంతాలు భక్తుల కోలాహలంతో జనసంద్రంగా మారాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గిరిజన పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకువచ్చారు. హుజురాబాద్ పట్టణంలోని తెనుగువాడ నుంచి సారలమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి రంగనాయకుల గుట్ట గద్దెపై ప్రతిష్టించారు. కమలాపూర్ మండలం భీంపల్లి శివారులోని గువ్వల గుట్ట నుంచి సారలమ్మను డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య జూపాక గద్దెపైకి చేర్చారు. అమ్మవార్ల రాకతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పగిడిద్ద రాజు, గోవిందరాజులను కూడా గద్దెలపై ప్రతిష్టించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి...
జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క రాక నేడు గురువారం జరగనుంది. పెద్దపాపయ్యపల్లి గ్రామం నుంచి రంగనాయకుల గుట్టకు, కమలాపూర్ మండలం భీంపల్లి గువ్వల గుట్ట నుంచి జూపాకకు సమ్మక్క తల్లిని గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజారులు తీసుకురానున్నారు. సాయంత్రం సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో జాతర పతాక స్థాయికి చేరుకోనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు హుజురాబాద్ చైర్మన్ గంట కిరణ్ రెడ్డి, జూపాక చైర్మన్ అపరాధ సాయిలు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు, ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. జాతర ప్రాంగణంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ అధికారులు, ఈఓలు స్వయంగా పర్యవేక్షిస్తూ భక్తులకు కనీస ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.






