సారు స్పందనకు వందనం.. మా ఊరికి బస్సు వచ్చింది!

by  |
RTC Bus
X

దిశ, తుంగతుర్తి: ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలకు నేడు ఫులిస్టాఫ్ పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ, ఆస్టీసీ అధికారుల స్పందనకు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి బస్సు సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు శుక్రవారం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి.

గత కొన్నాళ్లుగా తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. దీంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణ సౌకర్యం లేక విద్యార్థులు సైతం చదువులకు మధ్యలోనే స్వప్తి పలికారు. అయితే ఇటీవల వీసీ సజ్జనార్ ఆర్టీసీ చైర్మన్ కావడంతో ఆయన నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా సమస్యలను వివరించినా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన యువకులు తమ గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు సైతం పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు విజ్ఞప్తులు చేశారు. ఏళ్ల తరబడి బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే సూర్యాపేట జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లో మారుమూల గ్రామాలకు బస్ సర్వీసులకు నడపాలని కోరారు. ఆయా గ్రామాల నుంచి జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్‌కు బస్ సౌకర్యం కల్పించాలని వివరించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఆ ఇద్దరి కృషితో సూర్యాపేట ఆర్టీసీ అధికారులు బస్ సర్వీసులను ప్రారంభించారు, శుక్రవారం తుంగతుర్తి మండలంలోని మారుమూల ప్రాంతాలైన బండ రామారం, మంచతండా, సూర్యనాయక్ తండా, అర్వపల్లి, తిరుమలగిరి మండలంలోని రాజునాయక్ తండా, జలాల్ పురంతోపాటు మరో ఏడు గ్రామాలకు బస్ సర్వీస్ నడిచింది. ఈ ప్రాంతాల నుంచి నేరుగా సూర్యాపేటకే కాకుండా హైదరాబాద్ కూడా వెళ్లేలా బస్సులను నడపనున్నారు. కాగా, నూతన బస్ సర్వీసులను తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్యలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బస్సు సర్వీస్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు, ఎండీ సజ్జనార్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగమ్మ, సర్పంచులు లకావత్ యాకునాయక్, శారద, ఉప్పునూతల ప్రణీత జేసీరెడ్డి, మాజీ సర్పంచులు గడ్డం ఉప్పలయ్య, మాన్‌సింగ్, నాయకులు గుండగాని రాములు, మాలోతు సుధాకర్, కొమ్ము వెంకన్న, మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story