అపురూప ‘సౌందర్య’గా మలార్

by  |
అపురూప ‘సౌందర్య’గా మలార్
X

దిశ, వెబ్‌డెస్క్ : అపురూప సౌందర్యవతి.. నటనలో మేటి.. సహజత్వానికి చిరునామా.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ సౌందర్య. అలనాటి మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు పొందిన అందాల రాశి సౌందర్య. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చెరగని ముద్ర వేసింది. అన్నిటా రాణించి అందరినీ మెప్పించిన ఆ సహజనటి బయోపిక్ తెరకెక్కించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతుండగా.. తాజాగా మాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సౌందర్య జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. తరతరాలకు స్ఫూర్తిని పంచే ఆమె జీవిత కథకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్టు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

కాగా, ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ మలార్ బ్యూటీ సాయి పల్లవి.. సౌందర్య పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఇప్పటికే నటిగా భేష్ అనిపించుకున్న సాయి పల్లవి.. కేవలం నటనా ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సౌందర్య బయోపిక్ కూడా చేజిక్కించుకుందని సమాచారం. ఇదే నిజమైతే, మహానటి సినిమాతో కీర్తి సురేష్ నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొంది, నేషనల్ అవార్డ్ కొట్టేసినట్లు.. సాయి పల్లవి కూడా సౌందర్య పాత్రలో ఒదిగిపోయి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందుతుందేమో చూడాలి మరి. ఎంతో మంది నేటి హీరోయిన్లు సౌందర్య పాత్రలో తెరపై జీవించాలని కోరుకుంటున్న వేళ.. సాయి పల్లవికి ఆ అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే అంటున్నారు విశ్లేషకులు.

Next Story