మంత్రిగారు 3 ఏళ్లలో ఇవ్వని పరిహారం 3 నెలల్లో ఇస్తారంట?

by  |
మంత్రిగారు 3 ఏళ్లలో ఇవ్వని పరిహారం 3 నెలల్లో ఇస్తారంట?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గతంలో ఎస్సారెస్పీ.. ప్రస్తుతం సదర్మాట్.. వారిని రెండుసార్లు నిర్వాసితులుగా మార్చేసింది.. తమ బతుకు రోడ్డున పడుతుందని తెలిసినా.. తమ త్యాగం వల్ల బీడు భూములు పచ్చని వనాలుగా మారుతాయని.. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని.. పది జీవితాల్లో వెలుగులు వస్తాయని.. తమ జీవనాధారం ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడలేదు.. ప్రాజెక్టు కడతామంటే పంట భూములనున ఇచ్చేశారు.. మూడేళ్లు గడిచినా.. పరిహారం పైసల జాడ లేదు.. జీవనాధారం పోయి.. వేరే భూమి కొనే దారి లేక.. కూలీ చేసుకుంటు బతుకు వెల్లదీస్తున్నారు.. రోజు రోజుకు భూముల ధరలు పెరుగుతుంటే.. అమ్మేవారు లేకపోగా.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వారిది.. తమ గోడు వినేదెవరు.. గోస పట్టించుకునేదెవరో.. తెలియని పరిస్థితి..

మూడేళ్లుగా ఎదురు చూపులు

సదర్మాట్ నిర్వాసితులు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు.. మూడేళ్లుగా అన్నదాతలు పైసల కోసం ఎదురు చూస్తున్నారు.. పలుకుబడి ఉన్న నేతలు, బడా రైతులు మూడేళ్ల క్రితమే పరిహారం పైసలు తీసుకోగా.. పేద, చిన్న, సన్నకారు రైతులకు మాత్రం నిరీక్షణ తప్పటం లేదు.. దీంతో తమకు పరిహారం పైసలు ఇవ్వాలంటూ.. సదర్మాట్ బ్యారేజీ నిర్వాసిత రైతులు ఆందోళన బాట పట్టారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని పోరుబాట పట్టారు.. రోజుకో తరహా ఆందోళన, నిరసన నిర్వహిస్తుండగా.. దీనికి విపక్ష పార్టీల నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. మూడు నెలల్లోగా నిర్వాసితులకు పరిహారం డబ్బులు అందేలా చూస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఇవ్వాల్సిందే రూ.45 కోట్లే

మామడ మండలం పొన్కల్ సమీపంలో గోదావరి నదిపై సదర్మాట్ బ్యారేజీని నిర్మిస్తున్నారు. దీంతో సుమారు 15వేల ఎకరాల ఆయకట్టుకు ఖానాపూర్ నియోజకవర్గంలో సాగునీరు అందనుంది. 2016 అక్టోబర్ 25న ఈ బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించగా.. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సుమారు 1200 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి, మూలరాంపూర్లో 400ఎకరాలు, నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కమల్కోట్, పొన్కల్, కొత్త టెంబుర్ని, ఆదర్శనగర్ గ్రామాలకు చెందిన 800ఎకరాలు.. సుమారు 748మంది రైతుల భూములు పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఎకరానికి రూ.9.50లక్షల నుంచి రూ.10.40లక్షల వరకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 2018 మార్చిలో 259మంది రైతులకు రూ.34.26కోట్లు పరిహారం ఇవ్వగా.. మరో 489మంది రైతులకు రూ.45కోట్ల మేర పరిహారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూములెట్లా కొనాలి

జగిత్యాల జిల్లాలో పూర్తిగా ఒకే సారి పరిహారం చెల్లించగా.. నిర్మల్ జిల్లా మామడ మండలంలో సగం మంది రైతులకు కూడా పరిహారం డబ్బులు అందలేదు. మూడేళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మామడ మండలంలో కొందరు పలుకుబడి గల నేతలు, పెద్ద రైతులకు పరిహారం అందగా.. చిన్న, సన్నకారు రైతులకు పరిహారం అందక పడిగాపులు కాస్తున్నారు. భూములు పోయి మూడేళ్లు గడిచినా.. కొందరికే పరిహారం రావటంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా గత కొంతకాలంగా బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోగా.. ఇటీవల మళ్లీ ప్రారంభం కావటంతో బాధిత రైతులు తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని ఆందోళన బాట పట్టారు. మూడేళ్లుగా పరిహారం డబ్బులు రాకపోగా.. భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బులు వచ్చిన వారు భూములు కొనుగోలు చేస్తుండగా.. పరిహారం రాని వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. భూముల ధరలు బాగా పెరగటం.. మూడేళ్లుగా పరిహారం రాకపోవటంతో ఇక తాము భూములు ఎలా కొనాలని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొట్ట చేతబట్టుకుని.. మోకాళ్లపై నిల్చోని

మామడ మండలం ఆదర్శనగర్, కొత్త టింబరేణి గ్రామాల రైతులు గతంలో ఎస్సారెస్పీలో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు. అక్కడి నుంచి పొట్ట చేతబట్టుకుని ఇక్కడ వచ్చి పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా సదర్మాట్ బ్యారేజీలో వారి భూములు పోతుండటంతో.. మరోసారి నిర్వాసితులుగా మారుతున్నారు. ఏళ్లు గడిచినా పరిహారం రాకపోవటంతో బాధితులు తాజాగా ఆందోళన బాట పట్టారు. ఇటీవల పొన్కల్ రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో బాధితులు మంత్రి అల్లోలను అడ్డుకున్నారు. బ్యారేజీ వద్ద పనులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పాటు వారం, పది రోజులుగా వివిధ రకాలుగా తమ నిరసన కొనసాగిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి, మోకాళ్లపై నిల్చోని, వంటావార్పు చేసి, ప్రాజెక్టు నీళ్లలో నిలబడి జలదీక్ష, మండల కేంద్రంలో ర్యాలీ.. ఇలా రకరకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దనే టెంటు వేసి.. రోజుకు 30మంది చొప్పున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాధిత రైతులకు విపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వచ్చి.. తమ సంఘీభావంతో పాటు మద్దతు ప్రకటించాయి.

త్వరలో పరిహారం అందేలా చూస్తాం: మ౦త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి

పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం డబ్బులు అందేలా చూస్తాం. కరోన కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. నాబార్డ్ నుంచి రుణం తీసుకుని అయినా పరిహారం ఇస్తాము. మూడు నెలల్లో విడతల వారీగా పరిహారం అందేలా చూస్తాం..


Next Story

Most Viewed