రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లో‌కి డబ్బులు

1291

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి రైతు బంధును ఈసారి త్వరగానే విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరు వరకు నిధుల సర్దుబాటు చేసుకుని, వచ్చేనెల తొలి వారం నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా నిధుల సమీకరణకు ఆదేశాలిచ్చారు. గత నెలలో పండుగల సీజన్లలో వేల కోట్ల వ్యాపారం జరుగగా.. జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగాయి. అంతేకాకుండా పలు పథకాలకు సంబంధించిన నిధులు కూడా సర్కారు ఖజానాలో నిల్వ ఉన్నాయి. దీంతో నిధుల సర్దుబాటుపై ఇబ్బందులేమీ లేవంటూ ఆర్థికశాఖ సైతం సీఎంకు నివేదించింది.

7.19 లక్షల ఎకరాల్లో పంటలు

రాష్ట్రంలో యాసంగి సీజన్​ పంటల సాగు మొదలైంది. ఈ నెల 25 నాటికి వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం 7,19,105 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. యాసంగిలో ఈ సమయానికి సాధారణ సాగు 6.03 లక్షల ఎకరాలు ఉండగా.. ముందస్తుగానే రైతులు పంటలు వేస్తున్నారు. అయితే వరి సాగుపై సందిగ్థత కొనసాగుతుండటంతో వరిసాగు వెనకబడింది. ఈ సమయానికి సాధారణ సాగు 11 వేల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతానికి కేవలం 745 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. ఇక మొక్కజొన్న సాగు గణనీయంగా పెరుగుతోంది. గురువారం నాటికి 72 వేల ఎకరాలు దాటింది. వేరుశనగ కూడా సాధారణ సాగు దాటిపోయింది. నార్మల్​ సాగు 1.82 లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటికే 2.29 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. అటు మినుములు కూడా అంతే. ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతులు మినుముల సాగును చేపట్టారు. యాసంగిలో మినుములు సాధారణ సాగు 24 వేల ఎకరాలు ఉండగా.. ఈ నెల 25 నాటికి నివేదికల ప్రకారం 53,612 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరోవైపు పల్లి సాగు కూడా పెరిగింది. 2.72 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. మొత్తంగా యాసంగి సీజన్​లో గురువారం నాటికి 7.19 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు.

వచ్చే నెల నుంచే రైతుబంధు

యాసంగి సాగు మొదలుకావడంతో.. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల నిధులు అవసరం అవుతాయని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. సీఎం ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ఈ నెలాఖరులోగా యాసంగి సీజన్‌లో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికతో పాటు, రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి సీఎం కేసీఆర్​ కీలక ఆదేశాలు ఇస్తారని, డిసెంబర్​ మొదటి వారం నుంచే రైతుబంధు నిధుల పంపిణీ ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.

గత జూన్‌ నెలలో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. ఈ యాసంగి సీజన్‌కు వచ్చేసరికి మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరుగుతుంది. సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాల నంబరు, బ్యాంకు ఖాతాలన్నీ వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. మారిన బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఐఎఫ్​ఎస్​సీ నెంబర్లు కూడా అప్టేడ్​ చేశారు. దీంతో రైతుబంధు నగదు పంపిణీకి ఇబ్బందులేమీ ఉండవని అధికారులు చెప్పారు. ఇక కొత్తగా పాస్‌ పుస్తకాలు జారీ అయితే ఏఈవోలకు వారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రైతులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. గడిచిన వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిధులను సర్దుబాటు చేసుకుని.. డిసెంబరు మొదటి వారంలో రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ఉంటుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

వారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. త్వరలో జీతాల పెంపు?