సాగుబడిలో సోషల్ మీడియా.. టెక్నాలజీతో వ్యవసాయం

by  |
Paleru
X

దిశ, పాలేరు: మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యువతదే పైచెయ్యి అంటారు. కానీ అది ఒకప్పటి మాట. గ్రామీణ ప్రాంత రైతులు సైతం నేడు సాంకేతికను వినియోగించుకోవడంలో ముందువరసలో ఉన్నారు. ఏ పంట సాగు చేయాలి, ఏ విత్తనాలు వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, పొలం గట్టుపై ఉండి మందులను ఎలా పిచికారి చేయాలి, వ్యవసాయ అధికారులు ఏం చెబుతున్నారు, శాస్త్రవేతలు ఏం సూచిస్తున్నారు.. ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ సాగు నుంచి ఇజ్రాయిల్ వ్యవసాయం వరకు అన్నీ ఇంటి దగ్గర నుంచే చేసేస్తున్నారు. చేనుకు రోగం సోకినా.. క్షణాల్లో మందులను తెలుసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? వీటిన్నీటికి ఒక్కటే సమాధానం. అదే సోషల్ మీడియా. వాట్సప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. వీటి ద్వారానే వ్యవసాయంలో తలపండిపోతున్నారు. అదేలాగో చూద్దాం…

సోషల్ మీడియా విత్తనం పడింది ఇక్కడే..

గ్రామీణ ప్రాంతాల్లోకి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా పల్లె్లోనూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే పాలేరు నియోజకవర్గంలోని కొంతమంది రైతులను మారుతున్న టెక్నాలజీ ఆకర్షించింది. దానినే సద్వినియోగం చేసుకుంటూ యువ రైతులు ముందడుగు వేశారు. వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్‌లతో నూతన వ్యవసాయ విధానాలను చూశారు. యూట్యూబ్ ద్వారా నూతన సాగు వివరాలతో పాటు కొత్త పంటలు, పంట సాగు చేసిన రైతు వివరాలు తీసుకుని ఆ రైతుతో నేరుగా మాట్లాడుతూ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విస్తరిస్తున్న వరిలో వెదసాగు పద్ధతి రాష్ట్రంలోకి వచ్చింది సోషల్ మీడియా ద్వారానే అనడంలో సందేహం లేదు.

agricu

సెల్ ఫోన్‌లో అన్ని అప్లికేషన్లు తెలుగులో వస్తుండడంతో రైతులకు నూతన సాంకేతిక అందిపుచ్చుకోవడం సులువైంది. దీంతో వాట్సప్‌లో రైతుల కోసం పలు గ్రూపులు ఏర్పడ్డాయి. దీని కోసం కొంతమంది రైతులే… వారి పంట వివరాలు తెలుపుతూ గ్రూప్‌లో పోస్ట్ చేయడం, వేరే పంటకు సంబంధించిన వివరాలు గ్రూపులో పెట్టడంతో ఇతర రైతులు కూడా వాట్సప్‌లో వచ్చే వ్యవసాయ వివరాలకు సముచిత స్థానం ఇస్తున్నారు. ఇలాంటివి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో వ్యవసాయ సమాచార గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచార మార్పిడి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఒక్కొక్క సాగుకు ఒక్కో గ్రూప్

ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో వాట్సప్ గ్రూపుల్లో, కూసుమంచి మండల వ్యవసాయం, రైతు నేస్తం, వ్యవసాయశాఖ గ్రూప్, వ్యవసాయ మార్కెట్ సమాచారం, నేను నా వ్యవసాయంతో పాటు మరికొన్ని గ్రూపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఉండడంతో రైతులకు వ్యవసాయ మెలకువలు తెలుపుతున్నాయి. పంటకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను కూడా తెలియజేస్తున్నాయి. రైతుమిత్ర, అగ్రికల్చర్ లాంటి గ్రూపులు కూడా రైతులకు వినియోగపడుతున్నాయి. వీటితో పాటు పూల మొక్కలు, టెర్రస్ గార్డెనింగ్ కోసం కూడా మై డ్రీమ్ గ్రీన్ హౌస్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ లాంటివి కూడా ఉన్నాయి. వీటి ద్వారా చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఇండ్ల వద్దే సేంద్రీయ కూరగాయలు పండించడంతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

ప్రస్తుతం రైతులు సాంకేతికత ఆధారంగా చేస్తున్న వ్యవసాయం ఎక్కువగా సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయమే. సంప్రదాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోగా, ఒకవేళ సంప్రదాయ సాగు చేసినా నూతన మెళకువలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయం రసాయనిక ఎరువులమయమైన నేపథ్యంలో రైతులు చాలా వరకు సేంద్రీయ పంటల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.

agriculture

యూట్యూబ్‌దే ప్రధాన పాత్ర..

ఇన్స్టాగ్రామ్‌ తరహాలోనే ఫేస్ బుక్‌లో రైతుల కోసం ప్రత్యేక పేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పేజీల్లో వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, గత పద్ధతులు వినియోగించే కొన్ని వీడియోలతో పాటు నూతన మెలకువలపై వ్యవసాయ నిపుణులతో కొన్ని ఇంటర్వ్యూలను కూడా రైతుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు. వీటన్నిటితో పాటు వ్యవసాయంపై యువరైతాంగం ప్రధాన ఆకర్షణ చూపుతున్నది. యూట్యూబ్ ద్వారా లక్షల మంది రైతులు ఇతర ప్రాంతాల్లో పండుతున్న పంటల వివరాలు తెలుసు కోవడంతో పాటు వాటిని సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో రైతులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతతో కూడుకున్న వ్యవసాయాన్ని తెలిపేలా సాధనంగా ఫేస్ బుక్, యూట్యూబ్ సైతం తోడ్పాటును అందిస్తున్నాయి.

మందులు పిచికారిలోనూ టెక్నాలజే..

డ్రోన్‌లతో పంటలకు మందులు పిచికారి చేసే విధానం తెలుసుకుని అమలు చేస్తున్నారు. యూట్యూబ్‌లో రైతులు కూడా కృషి చేయడంతో శాస్త్రవేత్తలతో పలు ఇంటర్వ్యూలు నిర్వహించి, రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో వారం వారం జూమ్ మీటింగ్‌లు, వాట్సప్ గ్రూప్ కాల్స్ చేసుకుంటూ నూతన విధానాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని ఓ రైతు ఏర్పాటు చేసిన యూట్యూబ్ చానల్ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు చేరువైంది. తెలంగాణలో సాగయ్యే వరి వెదసాగు కూడా ఈ చానల్ ద్వారానే రైతులకు ఎక్కువగా చేరిందనేది వాస్తవం.

మా పని సులువైంది..

Janibaba

ప్రస్తుతం రైతులు సాంకేతిక అంశాలను జోడించి కొత్త సాగు పద్ధతులు అవలంభిస్తున్నారు. వాణిజ్య పంటల్లో మల్చింగ్, డ్రిప్ పంట మార్పిడి వంటివి చేపట్టి మంచి లాభాలు గడుస్తున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ఎంతో మేలు చేస్తూ సమాచార కేంద్రాలుగా అటు రైతులకు అధికారులకు వారధిగా ఉంటున్నాయి. యువ రైతులు వాటి ద్వారా 90% తెలుసుకుంటున్నారు. మేము రైతులకు సమాచారం చేర వేయడం సులువైంది.
-జానీబాబా, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి, కూసుమంచి


Next Story