ఆర్టీసీ కార్మికులకు జీతం మళ్లీ ఆలస్యం..

by  |
ఆర్టీసీ కార్మికులకు జీతం మళ్లీ ఆలస్యం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల వేతన సంబురం రెండు నెలలకే సరిపోయింది. గత రెండు నెలలు మొదటి వారంలోనే వేతనాలను జమ చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. నైట్​కర్ఫ్యూతో బస్సుల సంఖ్య కుదించడం, ఇతర రాష్ట్రాలకు కార్గో సేవలను నిలిపివేయడం తదితర కారణాలతో ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వేతనాలను అడ్జెస్ట్​ చేయాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే సీఎంకు నివేదిక కూడా పంపించింది.

ఆదాయం రావట్లే.. ఇప్పుడెలా..?

కరోనా కష్టాలు ఆర్టీసీని వీడటం లేదు. సెకండ్​వేవ్‌లో వేతన తిప్పలు మరింత ఎక్కువవుతున్నాయి. నాలుగు నెలల నుంచి కొంత గాడిన పడిందనుకున్న తరుణంలో సెకండ్​వేవ్‌తో మళ్లీ మొదటికొచ్చింది. గత నెల వరకు ప్రతి రోజు ఆర్టీసీ ఆదాయం రూ. 13 కోట్లుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం రూ. రెండు కోట్లలోపే వస్తోంది. ఈ నాలుగైదు రోజుల నుంచి రూ. కోటికే పరిమితమవుతోంది. అటు రోజువారీ ఖర్చులు తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో బస్సులను పెంచే పరిస్థితులు కూడా లేవు. అటు అంతరాష్ట్ర సర్వీసులన్నీ ఆపేశారు. గ్రేటర్‌లో 800 బస్సుల వరకు తిప్పుతున్నా వచ్చే ఆదాయం డీజిల్‌కు సరిపోని పరిస్థితుల్లోనే నెట్టుకువస్తున్నారు.

దీంతో ఇప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన జీతాలపై మళ్లీ ఎఫెక్ట్ పడింది. 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు అందక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్​ కేసులు కూడా కార్మికుల్లో ఎక్కువవుతున్నాయి. అటు జీతాలు పడక, వైద్య సదుపాయం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న 49వేల మంది కార్మికులకు ప్రతి నెల జీతాల కింద రూ. 180 కోట్లు చెల్లించాలి. అలాగే ఇంధనం ఖర్చుల కింద రూ. 200 కోట్లు పోయినా.. వచ్చే ఆదాయానికి, ఇచ్చే జీతాలకు సరిపోయేది. నష్టాలను పూడ్చుకోడానికి కార్గో సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ కార్గో సేవలకు సైతం బ్రేక్​పడింది. స్థానికంగా కార్గో బస్సులను ఆపేశారు. ఇతర రాష్ట్రాలకు సైతం నిలిపివేశారు. దీంతో ఆదాయం గణనీయంగా తగ్గింది.

సాయం చేయాల్సిందే..

ప్రస్తుతం వేతనాల కోసం ఆర్టీసీ యాజమాన్యం చేతిలో చిల్లిగవ్వ లేదు. రెండు, మూడు కోట్లు ఉన్నా అవి ఏ మూలకు సరిపోవు. ఇలాంటి స్థితిలో మళ్లీ ప్రభుత్వ సాయం కోసం చూడాల్సి వస్తోంది. గతంలో వేతనాల కోసం ప్రభుత్వం అప్పుడో, ఇప్పుడో రూ. 100 కోట్లు సాయం చేసేది. కానీ ఈసారి రూ. 180 కోట్లు కచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఆర్టీసీ ఖాతాల్లో నగదు లేదు. ఇప్పుడు సర్కారు సాయం చేస్తేనే వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉందని అధికారులు చెప్పుతున్నారు.


Next Story

Most Viewed