ఉద్యోగ సంఘాల్లో ఆర్టీసీ ప్లాన్​..?

by  |
ఉద్యోగ సంఘాల్లో ఆర్టీసీ ప్లాన్​..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల పాత్ర ఎలాంటిదో అందరికి తెలిసిందే. తమ ఉద్యోగాలను పక్కకు పెట్టి ఉద్యోగ జేఏసీగా ఏర్పాటై ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలా ఎంతో కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో తమకి మంచి గుర్తింపు ఉంటది అనుకుంటూ ఆశపడిన ఉద్యోగ సంఘాల ఆశలు ఇప్పుడు అడియాశలే అయ్యాయి. కానీ ఇప్పుడు ఉద్యోగ జేఏసీ లేకుండా చేసే ప్లాన్​ అమలవుతోందా అని ఉద్యోగ సంఘాల్లో హాట్​ టాపిక్​‌గా మారింది. ఎందుకంటే గతంలో ఆర్టీసీ జేఏసీని వ్యూహం ప్రకారం నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమ్మె వరకు ఉద్యోగ జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న ఆర్టీసీ జేఏసీని ఒంటరి చేశారు. ఉద్యోగులు మద్దతుగా ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ఉద్యోగ జేఏసీ కూడా అలాగే వ్యవహరించింది. మొత్తానికి ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేశారు. ఉద్యోగం పోతుందనే భయం కల్పించారు. వెంట ఎవరూ లేకపోవడంతో కార్మికులు తగ్గి.. విధుల్లోకి వచ్చారు. ఆ తర్వాత జేఏసీని నడిపించిన అశ్వత్థామరెడ్డి ప్రభుత్వానికి టార్గెట్​ అయ్యాడు. ఇప్పుడు ఏకాకిగా ఆర్టీసీ కార్మికుల కోసం మళ్లీ కొట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా ఒకే. కానీ ఇప్పుడు పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కూడా అదే పంథా మొదలవుతోందా… అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అటు సంఘ నేతలను కూడా భయపెడుతున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. నిన్నటిదాకా ప్రభుత్వంపై కారాలు… మిరియాలు నూరిన ఉద్యోగ సంఘాలు, నేతలు ఒక్కసారిగా ప్రభుత్వానికి మద్దతు చెప్పుతున్నారు. మండలి ఎన్నికల్లో అండగా ఉంటామంటూ ప్రకటిస్తున్నారు.

మధుసూదన్​రెడ్డి మళ్లీ మారాడు..

తెలంగాణ లెక్చరర్స్‌ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మధుసూదన్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ కేసు నమోదు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు.. బంధువుల ఇళ్లు, కార్యాలయం సహా మొత్తం పది ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వ హించి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్‌రెడ్డి బినామీగా భావిస్తున్న మహేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేశారు. మహేందర్‌రెడ్డి ఇంట్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ గుర్తించింది.

ఇలా ఇంటర్​ జేఏసీ ఛైర్మన్​ మధుసూదన్​రెడ్డిని ప్రభుత్వం టార్గెట్​ చేసింది. మూడు నెలలు జైలులో పెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా మారిపోయాడు. మొన్నటిదాకా ప్రభుత్వంపై కోపంగా ఉన్న మధుసూదన్​రెడ్డి ఇప్పుడు టీఆర్​ఎస్​కు అనుకూలంగా మారిపోయారు. మండలి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్​రెడ్డికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. ఆ దిశగా ప్రచారం కూడా చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెప్పుతున్నాయి.

బెదిరింపులా… బుజ్జగింపులా..?

మండలి ఎన్నికల కోసం సీఎం కేసీఆర్​ నేరుగా రంగంలోకి దిగారు. అంతా ప్రగతిభవన్​ నుంచే లీడ్​ చేస్తున్నారు. గతంలో ఏ ఎన్నికలైనా ఇంఛార్జీలకు అప్పగించేవారు. కానీ ప్రస్తుతం సీఎం అంతా తానై నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ మండలి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీపై పట్టు సడలుతుందని భావిస్తున్నట్లు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఇప్పటికే తేలింది. ఎందుకంటే పీఆర్సీ అంశంలో చాలా వ్యతిరేకతను ప్రభుత్వం మూటగట్టుకుంది ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ అభ్యర్థి అంటేనే ప్రభుత్వ ఉద్యోగవర్గాలు శత్రువులా చూస్తున్నాయి. ఈ సమయంలోనే ఉద్యోగ నేతలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను ఒప్పించే బాధ్యతలను వారిపైనే పెట్టారు. వారితో సమావేశాలు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. కచ్చితంగా పీఆర్సీ వస్తుందంటూ ప్రచారాన్ని సీఎం కేసీఆర్​ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో కొంతమంది ఉద్యోగ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఆర్సీ అంశంలో రోడ్డెక్కిన ఉద్యోగ సంఘాలన్నీ కీలకమైన మండలి ఎన్నికల్లో మాత్రం సైలెంట్​ అయ్యాయి. కారణాలేమీ తెలియదు. మండలిఎన్నికల్లోతమగొంతువినిపిస్తారనుకున్నా… అసలు సమయంలో చేతులెత్తేసే విధంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావడంతోనే సైలెంట్​ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది నేతలు బుజ్జిగిస్తూ.. మరికొందరిని బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. దీనిలో భాగంగానే మధుసూదన్​రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాడని ఉద్యోగుల్లో హాట్​ టాపిక్​.


Next Story

Most Viewed