రోజుకు నాలుగు డెలివరీలు.. సింగపూర్‌లో స్పెషల్ రోబోస్

by  |

దిశ, ఫీచర్స్: టెక్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ విశ్లేషకులు, బిజినెస్ టైకూన్స్.. ముంచుకొస్తున్న ఆటోమేషన్ సంక్షోభం గురించి నాన్ కాన్ఫరెన్స్‌లు, ప్రచార ర్యాలీల్లో హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కొన్ని రంగాల్లో ‘రోబోట్స్’ పనిచేస్తుండగా.. రాబోవు కాలంలో మానవ వనరులను తగ్గిస్తూ, వారి స్థానాలను తెలివైన యంత్రాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు ఆటోమేషన్ సంక్షోభం ఇప్పటికే తలెత్తిందని అంటున్నా, ఇంతకుమించి రాబోతుందనేది మరికొందరి వాదన. ఉదాహరణకు ఇంట్లో ట్యూషన్ చెప్పేందుకు, వంటింట్లో సాయం చేసేందుకు, ఇంటి పనులు చక్కబెట్టేందుకు ఆల్రెడీ చిట్టి రోబోలు వచ్చేశాయి. వైద్యరంగంలో ఆపరేషన్లు చేయడంతో పాటు బాంబులను గుర్తించే రోబోలు కూడా వచ్చేశాయి. న్యూస్ రీడర్స్‌గానూ హ్యుమనాయిడ్ రోబో సేవలందిస్తోంది. హోటళ్లలో ఆహారం వడ్డించడానికి, అథితులకు స్వాగతం చెప్పేందుకు సైతం ప్రత్యేక రోబోలున్నాయి. టెక్ సంస్థలు కూడా మనుషుల అవసరాలకు తగ్గట్లుగా కొత్త కొత్త రోబో‌లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సరుకులు డోర్ డెలివరీ చేసే రోబో అందుబాటులోకి వచ్చింది.

ఆహారం, కిరాణా, ఇతరత్రా నిత్యావసరాలను ఆన్‌లైన్ ఆర్డర్ చేస్తున్నాం. ఈ మేరకు చాలామందికి డోర్ డెలివరీ సౌకర్యం తప్పనిసరైంది. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలోలో ఎక్కువమంది ఇదే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ఓట్సా (OTSAW) హోమ్ డెలివరీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండు ప్రత్యేక రోబోలను రూపొందించింది. ఏడాది కాలంగా తమ కిరాణా సామాగ్రిని ప్రజలకు అందించడానికి ఈ రోబోలను వినియోగించడం విశేషం. దాంట్లో ఓ రోబోకు ‘కామెల్లో’ అని పేరు పెట్టగా, ఏడాది కాలంగా ఆ రోబో దాదాపు 700 గృహాలకు రేషన్ సరుకులను పంపిణీ చేసింది.

పాలు, గుడ్లు వంటి కిరాణా సరుకులను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రోబో ఏ సమయానికి ఇంటికి సరుకులు తీసుకొస్తుందో కూడా మన మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఈ రోబోల్లో 3డీ సెన్సార్లు, కెమెరా సహా రెండు కంపార్ట్‌మెంట్లు ఒక్కొక్కటి 20 కిలోల లోడ్ మోస్తుంది. రోజులో నాలుగు డెలివరీలు చేసే ఈ రోబోలను.. ప్రతి డెలివరీ తరువాత ఆల్ట్రా వయొలేట్‌ కాంతితో శానిటైజ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంటాక్ట్‌లెస్ సేవలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోబోలుచాలా ఉపయుక్తంగా ఉంటాయని కంపెనీ భావిస్తొంది. వీటి ద్వారా కస్టమర్లు తమ సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా.. వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed