టీ20ల్లో మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు

by  |
టీ20ల్లో మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో టీ20 ఫార్మాట్‌లో 2 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఈ ఘనతను ఎవరూ అందుకోలేదు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన రిజ్వాన్.. 2వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. రిజ్వాన్ ఈ ఏడాది మొత్తం 2036 పరుగులు చేశాడు. ఇక ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్నాడు.

బాబర్ ఈ ఏడాదే 1779 పరుగులు చేశాడు. మూడో స్థానంలో 1665 పరుగులతో క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 2016లో ఈ రికార్డు సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016లో 1614 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను పాకిస్తాన్ వైట్ వాష్ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో గెలిచింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రిజ్వాన్ (87), బాబర్ అజమ్ (79) అర్ద శతకాలతో చెలరేగడంతో పాక్ విజయం సులభమైంది. వీరిద్దరూ కలసి పొట్టి ఫార్మాట్‌లో ఆరో సారి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అగ్రస్థానంలో ఉన్నారు. భారత ఓపెనింగ్ జోడి రోహిత్-రాహుల్ ఐదు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Next Story