‘వరి’కి వైరస్.. ఎర్రబారుతున్న పైరు

1299

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రైతాంగం పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తారు. వరి, పత్తి, చెరుకు, కందులు, మొక్కజొన్న తోపాటు పెసర్లు, గోధుమలు సాగు చేస్తారు. మూసి ఆధారిత కాల్వలు, వర్షాధారంపై ఆధారపడ్డ చెరువులు, కుంటలు ప్రధాన సాగునీటి వనరులు. వీటిపై ఆధారపడి రైతులు సాగు చేస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి నీటితో కళ కళ లాడుతున్నాయి. దీంతో ఈప్రాంత అన్నదాతలు యాసంగిలో వరి సాగు అధికంగా చేశారు. జిల్లాలో సుమారు 2.2లక్షల పై చిలుకు రైతు కుటుంబాలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నాయి.

జిల్లాలో వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. జిల్లాలో ఈ యాసంగిలో 2.04,800 ఏకరాలలోవరి సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భూధాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాల మీదుగా మూసీనది ప్రవహిస్తోంది. బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి కాల్వ, ఆసీఫ్ నగర్ కాల్వ, ఏటికాల్వతో పాటు శాలిగౌరారం ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగు నీరండుతుంది. సాధారణంగా యాసంగిలో వరికి అగ్గితెగు లు సోకడం సహజం. పది రోజులుగా పగలు,రాత్రి వేళల్లో పలు వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో. వరిపైరుకు క్రమక్రమంగా అగ్గితెగులు వైరస్ సంక్రమించింది.రైతులు అప్రమత్తంగా లేకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదముంది.

పెరిగిన సాగు విస్తీర్ణం

జిల్లా సాగు విస్తీర్ణం గత యాసంగీతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 6వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది.గతసంవత్సరం 204800 ఎకరాల్లో వరిసాగు అయితే ప్రస్తుతం206800 ఏకరాలలో సాగయింది. ఆత్మకూర్ఎం మండలంలో10800 ఎకరా లు,ఆలేరులో6745.09,భూదాన్ పోచంపల్లిలో21980.50, గుండాలలో10743.35, భువనగిరిలో18250.15, బీబీనగర్‌లో 850.06, వలిగొండలో 31780.45,అడ్డగుడూర్‌లో 8883.28,చౌటుప్పల్ లో 10396.24,మూతకొండూర్‌లో 7804.48, మోత్కూరులో 9000.34,నారాయణపూర్‌లో 5810.06, రామన్నపేటలో 30308.14, బొమ్మలరామారంలో 6854.32, రాజపేటలో 12893.30, తుర్కపల్లిలో 6951, యాదగిరిగుట్టలో 9981 ఎకరాలలో వరి సాగు అయినట్లు అధికారుల అంచనా.

అగ్గితెగులు లక్షణాలు..

అగ్గితెగులు వరి ఆకులు, కనుపులు, వెన్ను పూసలపై కనిపిస్తుంది. నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడి పంట తగులబడినట్లు ఆకులపై లేత ఆకుపచ్చ మచ్చలు, కోసలకు సూదిమొనలా ఉండే కన్ను
ఆకారంలో ఉండి గాయాల మాదిరిగా కనిపిస్తాయి. తొలుత గడ్డిపై కనిపించి తరువా త చేనుకు వ్యాపిస్తుంది.

అగ్గితెగులుకు గల కారణాలు..

పగలు, రాత్రివేళల్లో ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, అధిక నైట్రోజెన్, నత్రజని ఉన్న నేలల్లో సులభంగా సోకుతుంది,వరి ఆకులపై ఎక్కువ సేపు తేమ నిలిచి ఉండడం వల్ల అగ్గితెగులు సోకుతుంది. మూసీ
పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

నివారణ చర్యలు

నత్రజని ఎక్కువగా వాడకూడదు, క్రమం తప్పకుండా నీరు పెడుతూ మొక్కలకు వత్తిడి లేకుండా చూడాలి. పొలం గట్లపైన తుంగ, గరిక, ఓడిపిలి, గడ్డి వంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి. వైరస్ నివారణకు 0.6గ్రా.ట్రైసైక్లోజోలో లేదా 2.5 లీ కానుగా మైసిన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

పెట్టుబడి పెరిగింది..

వరి సాగుకు ఈసారి పెట్టుబడి పెరిగింది. దున్నకం, నాట్లు, కలుపు తీయడానికి కూలీల రేట్లు బాగా పెరిగాయి. రోజు పసి పాపను చూసుకున్నట్లు చూసుకోవాల్సి వాడుతుంది. అధికారులు సకాలంలో స్పందించి సూచనలు, సలహాలివ్వాలి.

-సంపత్తి రాజిరెడ్డి, బ్రహ్మణపల్లి గుండాల మండలం

అప్రమత్తం చేస్తున్నాం..

రైతులను అగ్గితెగులుపై అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని మండలాలలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పంటలను పరిశీలిస్తున్నారు. జింక్ లోపం వల్ల, వాతావరణ మార్పుల వల్ల అగ్గితెగులు సోకుతుంది. వ్యవసాయాధికారులు సూచన మేరకు మందులు పిచికారీ చేయాలి.

– అనురాధ, యాదాద్రి జిల్లా వ్యవసాయాధికారి

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..