అడ్వోకేట్‌ తలకు రివాల్వర్ గురిపెట్టి..

114
High Court Advocate

దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతున్నాయి. మొన్న వామన్ రావు దంపతులు హత్య మరవక ముందే నిన్న జనగాం జిల్లాలో మరో అడ్వోకేట్ ను లారీతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున మరో హైకోర్టు లాయర్‌పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. దుండగులు ఏకంగా కత్తులు, రివాల్వర్‌తో దాడికి యత్నించడం కలకలం సృష్టించింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ -7కు చెందిన జశ్వంత్ చౌదరి హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన ఇటీవల వాదించిన భూవివాదం కేసు ఓడిపోయారు. దీంతో బాధితులు కేసు ఓడిపోయనందున తాము చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని కొంతకాలంగా గొడవపడుతున్నారు. తన దగ్గర లక్షల రూపాయలు తీసుకుని అవతలి వాళ్లకు అమ్ముడుపోయావని ఘర్షణకు దిగుతున్నారు. వారికి జశ్వంత్ చౌదరి ఎంత నచ్చజెప్పినా వినలేదు.

ఫిబ్రవరి 16న సాయంత్రం నలుగురు వ్యక్తులు జశ్వంత్ చౌదరి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. తాము చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య మాటమాట పెరగడంతో భూ యజమానులు, లాయర్ మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో లాయర్‌పై కత్తులతో దాడికి ప్రయత్నించారు. మరొకరు రివాల్వర్‌తో ఆయన తలకు గురిపెట్టారు. దీంతో భయపడిన లాయర్ గట్టిగా అరవడంతో స్థానికులు ఘటన స్థలంకు వచ్చారు. వారిని చూసి భూ యజమానులు పరారీ అయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు స్ట్రీట్ నంబర్ -7 లో లాయర్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి యత్నించిన భూ యజమానులు వదిలేసిన వెళ్లిన బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో కత్తితోపాటు నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. లాయర్ జశ్వంత్ చౌదరి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును స్ట్రీట్ నంబర్ -7 చూసే ఎస్సై నవీన్‌ను కాదని.. ఇటీవల బదిలీపై వచ్చిన మరో ఎస్ఐ చంద్రశేఖర్‌కు అప్పగించడం చర్చాంశనీయం అయింది. ఇన్‌స్పెక్టర్ పాలేపల్లి రమేష్ కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..