హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన బైక్.. నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్త్రిక్ బైకుల తయారీ సంస్థ రివోల్ట్‌ ఇటీవల తన ఆర్‌వీ400 ఎలక్ట్రిక్ బైకును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం బుకింగ్‌లను ప్రారంభించిన నిమిషాల్లో రికార్డు అమ్మకాలను సాధించిందని కంపెనీ వెల్లడించింది. మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించినప్పుడు కూడా రికార్డు విక్రయాలను నమోదు చేసిన రివోల్ట్ ఆర్‌వీ400 బైక్ రెండోసారి కూడా తక్కువ సమయంలో ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో సంస్థ బుకింగ్ చేసుకున్న బైకులను అందించేందుకు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలకు పెరిగిందని, అయితే వినియోగదారుల సౌకర్యం కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, వీలైనంత త్వరగా బైకుల డెలివరీ చేపట్టనున్నట్టు కంపెనీ వివరించింది. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్ సహా ఢిల్లీ, చెన్నై, ముంబై, పూణె నగరాల్లో ఈ బైక్ బుకింగ్ ప్రారంభించినట్టు పేర్కొంది. మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించిన సమయంలో కేవలం 2 గంటల్లో రూ. 50 కోట్ల విలువైన రివోల్ట్ ఆర్‌వీ400 బైకులు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది. 3.24 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి చార్జ్ చేయడం ద్వారా 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకుంటుంది. అలాగే, ఈ బైకులోని బ్యాటరీ 8 ఏళ్లు లేదంటే 1.5 లక్షల కిలోమీటర్ల వరకు హామీ ఇస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ కోసం నాలుగున్నర గంటలు పడుతుందని కంపెనీ వెల్లడించింది.Next Story