రెవెన్యూ ఆఫీసర్ల మాయ.. మామ భూమిని కోడలికి పట్టా చేసి..

by  |
రెవెన్యూ ఆఫీసర్ల మాయ.. మామ భూమిని కోడలికి పట్టా చేసి..
X

దిశ, కాటారం : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. రెవెన్యూ అధికారులు తలుచుకుంటే ఎలాంటి భూ రికార్డులైన మాయం చేయడం పెద్ద పనేమీ కాదు అన్నట్లుగా ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల రెవెన్యూ అధికారుల తీరు. 40 ఏళ్లుగా, పట్టా పహాని, కబ్జా రికార్డుల్లో ఉన్న భూమిని రెవెన్యూ అధికారుల అండదండలతో ఓ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం రికార్డుల్లో మాయం చేశాడు. ఈ క్రమంలో బాధిత రైతు కుటుంబం విలేకరుల సమావేశంలో కన్నీరుమున్నీరైన ఘటన మల్హర్ మండలం తాడిచెర్లలో శనివారం చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. బాధిత రైతు కోట లక్ష్మయ్య, అలియాసిస్ (పారిపెళ్లి లక్ష్మయ్య) కు చెందిన పట్టా భూమి సర్వే నెంబర్ 873లో రక్బ 11 గుంటలు.. 40 సంవత్సరాలుగా అన్ని ఆధారాలతో ఇల్లు నిర్మాణం చేసుకొని బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బొబ్బిలి రాజయ్య అలియాసిస్( లాల్సి రాజయ్య) అనే వ్యక్తి రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా అతని కోడలు కోట లావణ్యపై.. ఆన్‌లైన్ పట్టా చేయించుకున్నాడని విలేకరుల ముందు తమ గోడు వినిపించారు. తమ తండ్రి పేరు మీద ఉన్న భూమిని ఆన్‌లైన్ చేయాలని రెవెన్యూ అధికారులు, కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పట్టించుకోవడంలేదని అన్నారు.

కోట లావణ్యకు తమ భూమిని అక్రమంగా ఎలా పట్టా చేశారో తెలపాలని బాధిత రైతు భార్య కోట సమ్మక్క, కుమారులు రాజసమ్మయ్య, నర్సయ్యలు అధికారులను ప్రశ్నించారు. రెండు సంవత్సరాల క్రితం చేసుకున్న అక్రమ పట్టాను తొలగించి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న దుర్మార్గులపై, లంచాలు తీసుకుని అక్రమ ఆన్‌లైన్ పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బాధిత రైతు కుటుంబం హెచ్చరించారు.


Next Story

Most Viewed