కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: రేవంత్ రెడ్డి

by  |
కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: రేవంత్ రెడ్డి
X

దిశ, కుత్బుల్లాపూర్ : కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లో మంగళవారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతమంది నాయకులు పోయినా, ఉన్నా, పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ఇక్కడ గల్లీలో కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. మన రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దోసుకుంటున్నాయని, రెండు పార్టీలు తోడు దొంగ పార్టీలే అన్నారు. రైతులకు అండగా ఉండాల్సింది పోయి వరి వేస్తే ఉరి అన్నట్లుగా సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి ఈ రెండు రోజుల సదస్సు అన్నారు.

క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాగుబోతు సీఎం మాటలను నిజం చేయొద్దన్నారు. మేము పదవులు అనుభవిస్తున్నామంటే కార్యకర్తల వల్లేనన్నారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటానన్నారు. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌస్ లో బందీ అయిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వారితో సమానమన్నారు. కష్టపడే కార్యకర్తలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానన్నారు. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

క్రియాశీల నిర్మాణం ముఖ్యం : భట్టి విక్రమార్క
ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీల నిర్మాణం ముఖ్యమని సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తులు, నాయకులు వచ్చి పోతుంటారని, కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కొన్ని పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు మల్లు రవి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed