కేటీఆర్ సీఎం అయితే ఆ ముగ్గురికి సమస్య: రేవంత్ రెడ్డి

by  |
mp revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి సీఎంగా మంత్రి కేటీఆర్​ను చేసేందుకు సీఎం కేసీఆర్​కు ఇష్టం లేదని, కేటీఆర్​ను సీఎం చేయనే చేయరని కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్​ సమర్థత ఏమిటో సీఎం కేసీఆర్​కు తెలుసన్నారు. సోమవారం మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఫైర్​ అయ్యారు. సీఎం ఎవరు అవుతారనేది కల్వకుంట్ల కుటుంబ సమస్య మాత్రమేనని, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఒకవేళ కేటీఆర్​ సీఎం అయితే మాత్రం ప్రధాన సమస్య హరీష్​రావు, సంతోష్​రావు, కవితకే ఉంటుందన్నారు. కేటీఆర్​ సీఎం కాకుండా వీళ్లే అడ్డుకుంటారన్నారు.

ఇప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్​ సీఎం పదవికి అర్హుడు అంటూ ప్రకటిస్తున్నారని, అయితే సీఎంగా కేసీఆర్​ అనర్హుడు… అసమర్థుడు అని ఒప్పుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవులు కావాలని ఇంకా కోరుకుంటున్నవాళ్లే ముఖ్యమంత్రి మారాలనుకుంటున్నారని, కానీ సీఎంగా కేటీఆర్​ను చేయనే చేయరన్నారు. కేటీఆర్​కు సీఎం అయ్యేందుకు అర్హతే లేదని, కానీ సీఎం కేసీఆర్​ చెప్పే అబద్ధాల కంటే కేటీఆర్​ చెప్పుతున్న అబద్ధాలే ఎక్కువగా ఉంటున్నాయని, కేసీఆర్​ కంటే పచ్చి అబద్ధాల కోరు కేటీఆర్​ అని మండిపడ్డారు. కేసీఆర్​ కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పుతున్నాడని కేవలం దీనితోనే సీఎం పదవికి అర్హత సాధించారని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయరని, మంత్రి పదవి పోతుందని భయపడేవారు, కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అని అంటున్నారన్నారు.

రాష్ట్రాభివృద్ధి అంశంలో అన్నీ తప్పుడు లెక్కలేనని, ఇప్పుడు కొడంగల్​ గురించి పేపర్​లో రాసిన అభివృద్ధి వార్త ఒక్కటైనా టీఆర్​ఎస్​ చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రకటించారు. మంత్రి కేటీఆర్​ అబద్ధాలకు కేరాఫ్​గా రుజువు చేసుకుంటున్నారని, కొడంగల్​ డెవలప్​మెంట్​పై పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో చేసిన తప్పులను సరిదిద్ధుకునేందుకు ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చారని, కానీ వారి తప్పుల పాలన కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని సీఎం కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ను సీఎం చేయాలని రేవంత్​రెడ్డి సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో బీజేపీ, టీఆర్​ఎస్​ పార్టీలు వ్యూహాత్మకంగా విమర్శలు చేసుకుంటున్నాయని, ఢిల్లీ దోస్తానా బలంగా ఉందన్నారు. కేంద్ర చట్టాలపై అగ్గి మండిన సీఎం కేసీఆర్​… ఒక్కసారే ఢిల్లీకి వెళ్లి వచ్చి ఎందుకు యూటర్న్​ తీసుకున్నారని, కేంద్రం భయపెట్టిందా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడి పాలన సాగుతుందని, టీఆర్​ఎస్​ చేసే దోపిడే కేంద్రానికి అనుకూలంగా మారుతుందన్నారు. అంతేకాకుండా జీహెచ్​ఎంసీ మేయర్ పదవి బీజేపీకి వదిలిపెడతానని సీఎం కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లి హామీ ఇచ్చి వచ్చారని, లేకుంటే చాలా పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయం ఉందని ఎంపీ రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.



Next Story

Most Viewed