ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆ పని చేసి చూపిస్తా: రేవంత్ రెడ్డి

by  |
ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆ పని చేసి చూపిస్తా: రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: ‘నా పాలమూరు అన్నల్లారా.. తమ్ముల్లారా.. కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డకు మంచి అవకాశం ఇచ్చింది.. మీరు అండగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర రూపురేఖలనే మార్చేస్తాను’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌పై విమర్శలు..

తెలంగాణ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు కోసమైనా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే ముందుగా పాలమూరు జిల్లానే అభివృద్ధి చేస్తామన్నారని గుర్తు చేశారు. కానీ, పోతిరెడ్డిపాడుకు ఏపీ నీళ్ళు తీసుకువెళుతుంటే ఈ కేసీఆర్ ఏం చేశారు అంటూ నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు, ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు.. కానీ, చివరకు తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పదివేల కోట్ల రూపాయలు ఇస్తే చాలు, పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. పాలమూరు గోస తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నేటికి పూర్తి చేయకపోవడంతో.. ఏపీ సీఎం ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడి నీటిని తరలించడానికి కుట్రలు చేస్తోంది అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుట్రలను అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతగానితనంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

పోలీసులకు వార్నింగ్..

‘పోలీసుల్లారా ఖబర్దార్.. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నాళ్ళో ఉండదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంగతి తేలుస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించే మా వాళ్లపై, కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్న వారిపై ఇన్ని కుట్రలు చేస్తారా..? అంటూ నిలదీశారు. ఖబర్దార్.. కేసీఆర్‌ను తొక్కేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, గీతా రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, డాక్టర్ మల్లురవి, డాక్టర్ వంశీచందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు ప్రసంగించారు.


Next Story

Most Viewed