రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్‌లోకి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

by  |
Revanth Trs
X

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే హుజూరాబాద్​ ఉప ఎన్నికపై ఫోకస్​ చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన ఆలోచన వేరే ఉన్నదని కాంగ్రెస్​ వర్గాల్లో టాక్. టీఆర్ఎస్ ​ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఆకర్షించి ఎలాగైతే వాటి పునాదులు పెకిలించే ప్రయత్నం చేసిందో.. అదేవిధంగా టీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి లాగేందుకు రేవంత్​ టార్గెట్​ చేశారని తెలుస్తున్నది. ఇందులో భాగంగా తొలి ‘ఆపరేషన్​ ఆకర్ష్​’ ఖమ్మం నుంచే ప్రారంభించనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఖమ్మం నుంచి ఇద్దరు, భద్రాద్రి నుంచి మరో ఇద్దరు రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం ఆపరేషన్ ​సక్సెస్ ​అయితే, మరికొందరు హస్తం బాట పట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకుల అంచనా.

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆట మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ ​ప్రధాన బలం.. ఇతర పార్టీల్లో ప్రధాన నేతలు ఎవరూ లేకుండా చేయడం. ఇప్పుడు అదే అంశాన్ని రేవంత్​ ఆయుధంగా చేసుకోబోతున్నారు. ఈ మేరకు ఆపరేషన్ ​ఆకర్ష్‌ను ఖమ్మం నుంచే స్టార్ట్ చేసినట్లు తెలుస్తున్నది. సరైన నాయకత్వం లేక ఖమ్మం జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి రేవంత్ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి మరో ఇద్దరు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్‌లోకి వెళ్లినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే వారికి అధికార పార్టీలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడడం, వచ్చేసారి ఎన్నికల్లో టికెట్ దొరకడం కష్టంగా ఉన్న తరుణంలో.. వారు కాంగ్రెస్ ఆపరేషన్‌లో పడ్డట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వారు రేవంత్ రెడ్డితో భేటీ జరిగి సూచనప్రాయంగా తమ అభిప్రాయాలను చెప్పినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ చీఫ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు.. ఇంకా ఎన్నికలకు సమయం ఉండడంతో అదును చూసి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.

రేవంత్ టీం సంప్రదింపులు

ఇప్పటికే ఆ నలుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా రేవంత్​తో హైదరాబాద్ లో రహస్య సమావేశం అయినట్లు సమాచారం. అనుచరుల దందాలతో ఎక్కువగా వివాదాల్లో నిలిచే ఓ ఎమ్మెల్యే.. రేవంత్​తో ఎక్కువగా సాన్నిహిత్యం ఉన్న మరో ఎమ్మెల్యే ఇప్పటికే రెండు సార్లు భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ, ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మరో ఎమ్మెల్యే.. ఓ ఏజెన్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే మొత్తం నలుగురు ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ ఆకర్ష్ లో పడినట్లు చర్చ జరుగుతున్నది. వీరందరికీ రేవంత్ సహా ఆయన అత్యంత సన్నిహితులతో మంచి సంబంధాలు ఉండడం గమనార్హం.

ఆచితూచి అడుగులు..

కాంగ్రెస్ చీఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. తమ అత్యంత సన్నిహితులు, బంధువుల వద్ద మాత్రమే ఈ విషయాన్ని చర్చించి సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. వారు కారు పార్టీ దిగితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? అధికార పార్టీకి చెందిన పెద్దలు ఏమైనా ఇబ్బందులకు గురిచేస్తారా..? కేడర్ తమతో పాటే వస్తుందా..? వచ్చే ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొచ్చు..? లాంటి అంశాలను వారి వద్ద ప్రస్తావించి వారి అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఫైర్ బ్రాండ్ రేవంత్‌ను నమ్ముకుంటే కచ్చితంగా భవిష్యత్ బాగుంటుందని, అధికార పార్టీలో అయితే వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితే అని వారు మథనపడుతున్నట్లు సమాచారం. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మంలో సక్సెస్ అయితే..

మొదట ఖమ్మంపై దృష్టి పెట్టిన రేవంత్ టీం ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను తమ ఖాతాలో వేసుకున్నట్లు భావిస్తున్నది. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నందున ఇంకా విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలనే చూస్తున్నట్లు తెలుస్తున్నది. వీరి తర్వాత మరి కొంతమంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రేవంత్ అత్యంత సన్నిహితులు టచ్​లోకి వెళ్లినట్లు సమాచారం. ఎక్కువగా ఖమ్మంపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. వీరిని లాగితే రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా లైన్​లోకి వస్తారని రేవంత్ టీం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అసంతృప్త పెద్ద నేతలకు సైతం గాలం

ఎమ్మెల్యేలతో పాటు కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటూ ఏ పదవిలేని వారు, పదవి నుంచి తప్పించిన వారు, ప్రాధాన్యం లేని వారు.. ఏ పార్టీలోకి వెళ్లలేక టీఆర్ఎస్‌లోనే ఉన్నవారు.. ఇలా అసంతృప్త స్వరం వినిపిస్తున్న వారి లిస్ట్ సైతం రేవంత్ టీం ఇప్పటికే సేకరించిందని సమాచారం. వీరందరికీ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఎవరెవరు తమవైపు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయొచ్చో వారితో సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. దీన్ని బట్టి అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పెద్ద నేతలను సైతం లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్

పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం.. ఉపాధ్యక్షులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పొదెం వీరయ్య కూడా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగేందుకు వ్యూహాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం ఉండడంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ ఉత్సాహం నిండింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సైలెంట్​గా ఉన్న నేతల పార్టీ కార్యక్రమాలను ఇక మీదట చురుకుగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పది నియోజకవర్గాల నుంచి పార్టీకి చెందిన ముఖ్యనేతలు, భారీగా కార్యకర్తలు రేవంత్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారు.

Follow Disha daily Facebook page :https://www.facebook.com/dishatelugunews


Next Story

Most Viewed