నారా లోకేష్​ జగన్​ పార్టీ..!

by  |
నారా లోకేష్​ జగన్​ పార్టీ..!
X

దిశ, ఏపీ బ్యూరో: ఇదేంటని ఆశ్చర్యపోనవసరం లేదు. నిజమే. విపక్ష టీడీపీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ తనకు తెలయకుండానే సీఎం జగన్​కు మేలు చేశారు. దీన్ని ఎవరు అంగీకరించినా.. ఒప్పుకోకపోయినా ఓ సారి జరిగిన ఘటనలను పునశ్చరణ చేసుకుంటే.. నాలుగు రోజుల క్రితం నారా లోకేష్​ గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పర్యటించారు. నడుముల్లోతు వరద నీళ్లలోకి దిగారు. రైతులతో మమేకమయ్యారు. వాళ్ల కష్టాలను, కన్నీళ్లను చూశారు. తానూ ఓ మనిషే కదా. చలించిపోయారు. ఆవేశంలో “సీఎం జగన్​రెడ్డికి అన్నదాతల కష్టాలు పట్టవా.. అంత:పురంలో నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటున్నారు. రైతుల కష్టాలు చూడ్డానికి తీరిక లేదా ” అని ప్రశ్నించారు.

మరుసటి రోజు వెంటనే హోంమంత్రితో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులతో అదే నియోజకవర్గంలో పడవలో వెళ్లి పర్యటించారు. బాధితుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గట్టిగా నిలదీసిన వాళ్లను హూంకరించారు. దీన్ని పట్టుకొని నారా లోకేష్​ వరదలతో బాధ పడుతున్న ప్రజలను చీదరించుకుంటారా అని నిలదీశారు. చివరకు సీఎం జగన్​కు తప్పలేదు. హెలికాప్టర్‌లో వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ సీఎం నుంచి ఉన్నతాధికారులదాకా ఎన్ని లేఖలు రాశారో మనం చూశాం. ఎన్ని జూమ్​ మీటింగులు పెట్టి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని తూర్పారబట్టారో విన్నాం. చివరకు ఆయన సీఎం జగన్​పై ఎన్ని నిరాధార ఆరోపణలు చేశారో కూడా కన్నాం. ఏ ఒక్క దానికీ సీఎం జగన్​ మోహన్ రెడ్డి స్పందించలేదు. అంతేకాదు. కనీసం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను ఒక్కటి కూడా సీఎం నోటి వెంట రాలేదు. అవుట్​డేటెడ్ ​పొలిటీషియన్​తో నాకెందుకులే అనుకున్నట్టుంది. కానీ సీఎం జగన్​మోహన్​రెడ్డిని నారా లోకేష్​ కదిలించారు. ఇప్పటిదాకా తండ్రి చాటు బిడ్డలా పప్పు అనిపించుకుంటున్న నారా లోకేష్​ ప్రజల కష్టాలపై వినూత్నంగా స్పందించారు. వరద నీటిలో బాధితులను పరామర్శించారు. దీంతో సీఎంలో కదలిక వచ్చింది.

ఇక ముసిలోడితో పెట్టుకుంటే తన చడ్డీ జారిపోతుందని లోకేష్​ భావించి ఉండొచ్చు. అందుకే కదన రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. లోకేష్​ వరద నీళ్లలో పర్యటనతో సీఎం జగన్ స్పందించారు. ఇక ఇలాగే ప్రజా సమస్యలపై లోకేష్​ ప్రత్యక్ష పోరాటానికి దిగొచ్చు. జనరేషన్​ ప్రభావం కావొచ్చు. చంద్రబాబు విమర్శలకు స్పందించని సీఎం జగన్​ లోకేష్​ వ్యాఖ్యలకు విలువిస్తున్నట్టు అవగతమవుతోంది. మరక మంచిదే. కాలం చెల్లిన రాజకీయ నాయకులతో అనవసరం. యువకుల మధ్య ఆరోగ్య కరమైన పోటీని ఆహ్వానించాల్సిందే. నవ సమాజపు రాజకీయాలకు ఊపిరులూదాల్సిందే.


Next Story

Most Viewed