మిగిలింది క‘న్నీరే’..!

by  |
మిగిలింది క‘న్నీరే’..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొద్దంతా చిత్తు కాగితాలు ఏరుకుంటారు.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బుడగలమ్ముకుంటారు.. ఐదు రూపాయల భోజనంతోనే కడుపు నింపుకుంటారు.. రాత్రిళ్లు డేరాలోనే సేద తీరుతారు.. ఇలాంటి సుమారు 350 కుటుంబాలకు సికింద్రాబాద్ సమీపంలోని లాలాపేట్ డివిజన్ చంద్రబాబునాయుడు నగర్ బస్తీ ఆశ్రయం కల్పిస్తోంది. గత మంగళవారం కురిసిన వర్షాలకు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. తెల్లవారు వచ్చి చూసేసరికి డేరా లేదు.. అందులోని సామానూ లేదు.. వరద వారి సర్వస్వాన్నీ ఊడ్చేసింది.. ఆదివారం మళ్లీ కురిసిన వర్షంతో వారు ఆశలు వదులుకున్నారు..

ఇప్పడు వారికి మిగిలింది కన్నీరే..!

రెండు దశాబ్దాలుగా వారి బతుకంతా ఆ బస్తీలోనే. గడచిన ఇరవై ఏళ్లలో ఎప్పుడూ మూసీ నది తమ పొట్టకొట్టలేదని, మొదటిసారి సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో బతికితే చాలనుకుని రోడ్డెక్కామని లాలాపేట్ డివిజన్ చంద్రబాబునాయుడునగర్ బస్తీ వాసులు తమ ఆవేదనను ‘దిశ’తో పంచుకున్నారు. ఓట్లప్పుడు వచ్చిన నాయకులు ఇప్పడు ఎవరూ కనిపించడం లేదని.. ఎవరైనా వచ్చి సాయం చేయాలని గుండె బరువు చేసుకుని అర్ధిస్తున్నారు..

మేం గరీబోళ్లం కదా..

చిత్తు కాగితాలు ఏరుకునేటోళ్లం.. రోడ్లపై బుగ్గలు అమ్ముకునేటోళ్లం.. తమ మీద ప్రభుత్వానికి కనికరం ఎందుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ‘కూటికి పేదోళ్లమైనా మేమూ మనుషులమే గదా.. మాకూ కడుపు ఉంటుంది.. ఆకలి ఉంటుంది.. బుక్కెడు బువ్వ పెట్టడం పార్టీలోల్లకు భారమవుతుందా? మేమంటే ఇంత చిన్నచూపా? పేదలను వాళ్లు ఆదుకోరా..?’ అని ఓ యువతి ప్రశ్నించింది. ‘మేం బురద కంపు పక్కనే ఉంటాం.. మా దగ్గర ఆ వాసనే వస్తుంది.. ఎంత పేదోళ్లమైనా కట్టుకోడానికి గుడ్డలైతే ఉండాల్సిందే గదా.. ఒక్క చీరతో ఎన్ని రోజులుండగలం..? ఆడోళ్లెవరైనా పెద్దమనుసు చేసుకుని సహాయం చేయకపోతారా అని అడుక్కుంటూ ఉన్నాం’ అని మరో వృద్ధురాలు కన్నీటితో విలపించింది.

ఒక్క దుప్పట్లోనే అందరం పడుకోవాలా..

ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు ఇవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అయితే కుటుంబం మొత్తానికి ఒక్కటే దుప్పటి రావడంతో పడుకోడానికి అందరికీ ఇబ్బంది అవుతోందని.. వర్షం, చలికి వణుకుతూనే పండుకుంటున్నామని పలువురు పేదలు వాపోయారు. ఒకపక్క దోమలు మరోపక్క చలితో ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ గుడిసె వేసుకోవాలంటే ఖర్చవుతుందని, ఎంతో నష్టపోయామని మళ్లీ పాత జీవితం రావాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదని నిట్టూర్పు విడిచారు. నిత్యం బతుకు పోరాటం చేసే తమ జీవితాల్ని ఈ వరద నిండా ముంచేసిందని బాధపడ్డారు.

వరద అన్నీ తీసుకెళ్లింది : సుధ, చంద్రబాబునాయుడు నగర్

ఇండ్లను ముంచిన వరద ఇండ్లలోని అన్ని వస్తువులు, నగదు, బట్టలను కూడా తీసుకెళ్లింది.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మాలో మేమే బాధపడుతున్నాం. ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాం.. మా పరిస్థితి దారుణంగా ఉంది.

గుడిసెలు కూలాయి : దాదేష్యా

వరద వచ్చిందని సర్దుకుంటూ పక్కనున్న డాబాల వైపు వెళ్తుండగానే గుడిసె కూలింది. ఇంకా నయం మా గుడిసెలోల్ల వారికి ప్రాణాపాయం జరుగలేదు. చిరు వ్యాపారులం. గుడిసె వేసుకోవడానికి డబ్బు కూడా లేదు.. అప్పు చేసి మళ్లీ వేసుకోవాలి..

బాధలు ఏమని చెప్పమంటారు : దుర్గ, చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ

అన్నీ బాధలే. వంట చేసుకునేందుకు పొయ్యిలు లేవు. బియ్యం గింజలు లేవు. అన్నీ వరదే తీసుకెళ్లింది. ఏం చేయాల్నో అర్థం కావడం లేదు.. దేవుడిపై భారం వేస్తున్నాం.. మమ్మల్ని ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుంటుంది..



Next Story